కాళేశ్వ‌రంపై కేంద్రానికి బీజేపీ నేత ఫిర్యాదు.. బాల్క సుమ‌న్‌ మండిపాటు

  • ఎన్జీటీ గైడ్ లైన్స్ ను పాటించ‌ట్లేదంటూ బీజేపీ నేత ఫిర్యాదు
  • అభివృద్ధిని అడ్డుకునే దిశ‌గా బీజేపీ చేస్తున్న కుటిల య‌త్నాలంటూ సుమన్ ఫైర్  
  • తెలంగాణ ప‌చ్చ‌బ‌డుతుంటే ఓర్వ‌లేకపోతున్నారంటూ  ‌విమర్శ 
తెలంగాణ‌కు కాళేశ్వ‌రం ప్రాజెక్టు జీవ‌నాడి కిందే లెక్క‌. కాళేశ్వ‌రం ప్రాజెక్టుతో తెలంగాణ‌లో చాలా ప్రాంతాల‌కు సాగు నీటితో పాటు తాగు నీరు కూడా అందుతోంది. అలాంటి ప్రాజెక్టును ఇప్ప‌టికే దాదాపుగా పూర్తి చేసిన కేసీఆర్ సర్కారు.. ప్రాజెక్టును మ‌రింత మేర విస్త‌రించే దిశ‌గా క‌దులుతోంది. 

ఈ నేప‌థ్యంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టు విస్త‌ర‌ణ‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఎన్జీటీ గైడ్ లైన్స్‌కు విరుద్ధంగా చేప‌డుతోందంటూ బీజేపీ తెలంగాణ శాఖ‌కు చెందిన పి.శేఖర్ రావు అనే నేత కేంద్ర ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేశార‌ట. ఈ విష‌యం తెలిసినంత‌నే టీఆర్ఎస్ యువ‌నేత‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ఓ రేంజిలో ఫైర‌య్యారు.

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే దిశ‌గా బీజేపీ చేస్తున్న కుటిల య‌త్నాల‌కు ఇదో ప్ర‌బ‌ల నిద‌ర్శ‌న‌మంటూ ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ త‌ర‌హా అభివృద్ధి నిరోధ‌క చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే వారిపై చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉందంటూ ఆయ‌న పిలుపునిచ్చారు.

 తెలంగాణ ప‌చ్చ‌బ‌డుతుంటే.. ఓర్వ‌లేక ప్రాజెక్టు నిర్మాణం మీద కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్న స‌న్నాసుల‌ను ఏమ‌నాలి? దీనిపై చ‌ర్చ జ‌ర‌గాలే అంటూ బాల్క సుమన్ తన ట్వీట్‌లో అభిప్రాయ‌ప‌డ్డారు. అంతేకాకుండా ఇదేదో తాను చేసిన ఆరోప‌ణ కాదంటూ.. బీజేపీ నేత శేఖ‌ర్ రావు కేంద్రానికి ఫిర్యాదు చేసిన వైనంపై ఓ ఆంగ్ల ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైన క‌థ‌నం కాపీని కూడా ఆయ‌న త‌న ట్వీట్‌కు జ‌త చేశారు.


More Telugu News