ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల తరలింపునకు మేం రెడీ: రష్యా

  • ఐరాస భద్రతా మండలికి వెల్లడించిన రష్యా రాయబారి
  • ఉక్రెయిన్ ఉగ్రవాదుల చెరలో భారతీయులున్నారని ఆరోపణ
  • 3,700 మందిని బందీలుగా చేసుకున్నారని కామెంట్
  • మిగతా దేశాల వారినీ తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేశామని వెల్లడి
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులతో పాటు ఇతర దేశాల విద్యార్థులనూ తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ సరిహద్దుల వద్ద ఇప్పటికే బస్సులను సిద్ధంగా ఉంచామని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి వెల్లడించింది. ఖార్కివ్, సూమీ సహా తూర్పు ఉక్రెయిన్ లోని నగరాలకు పంపించి విదేశీ విద్యార్థులను సరిహద్దులు దాటిస్తామని ప్రకటించింది. 

ఇవాళ భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశం సందర్భంగా రష్యా రాయబారి వస్సిలీ నెబెంజియా.. విద్యార్థులను సురక్షితంగా తరలించడంపై ప్రకటన చేశారు. ఖార్కివ్, సూమీల్లో 3,700 మందికిపైగా భారత విద్యార్థులను ఉక్రెయిన్ జాతీయులు బందీలుగా చేసుకున్నారని ఆరోపించారు. 

ఉక్రెయిన్ లోని ఉగ్రవాదులు వారిని విడిచిపెట్టడం లేదని, దాని ప్రభావం ఉక్రెయిన్ ప్రజలపైనే కాకుండా విదేశీయులపైనా పడుతోందన్నారు. ఖార్కివ్ లో 3,189 మంది భారత విద్యార్థులను బందీలుగా చేశారన్నారు. వియత్నాంకు చెందిన 2,700 మంది, చైనాకు చెందిన 202 మందిని బందీ చేశారని, సూమీలో 576 మంది భారతీయులు, ఘనాకు చెందిన 101 మంది, చైనాకు చెందిన 121 మందిని చెరబట్టారని ఆయన ఆరోపించారు. 

విద్యార్థుల తరలింపునకు రష్యాలోని బెల్గొరోడ్ లో 130 బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. నెఖోటీవ్కా, సూజా చెక్ పాయింట్లలో విద్యార్థుల కోసం తాత్కాలిక వసతి సదుపాయాలనూ ఏర్పాటు చేశామన్నారు. ఇదిలావుంచితే, ఇప్పటిదాకా తమ విద్యార్థులను బంధించారన్న ఎలాంటి సమాచారం తమకు రాలేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు.


More Telugu News