ఉక్రెయిన్ వీడిన జెలెన్‌స్కీ.. ఎక్క‌డున్నారో చెప్పిన ర‌ష్యా

  • జెలెన్ స్కీ ప‌రారీ అంటూ ఇదివ‌ర‌కే ర‌ష్యా ప్రచారం
  • వీడియోతో తిప్పికొట్టిన జెలెన్ స్కీ
  • తాజాగా జెలెన్ స్కీ ప‌రారీపై ర‌ష్యా మీడియా క‌థ‌నాలు
  • పోలండ్‌లో త‌ల‌దాచుకున్న‌ట్లు వెల్ల‌డి
ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ త‌న దేశం వ‌దిలి పారిపోయార‌ని ర‌ష్యా మీడియా తెలిపింది. యుద్ధ స‌మ‌యంలో ఉక్రెయిన్ సైన్యం వెన్నంటి నిలిచిన జెలెన్ స్కీ.. సైనికుల్లో ధైర్యం నూరిపోశారు. దేశాన్ని కాపాడుకునేందుకు యుద్ధ రంగంలోకి దిగేందుకు ఆస‌క్తి క‌లిగిన వారు ముందుకు వ‌స్తే..ఆయుధాలు ఇస్తామని కూడా ప్ర‌క‌టించి జెలెన్ స్కీ సంచ‌ల‌నం రేపారు. అంతేకాకుండా త‌మ దేశం ర‌ష్యా గుప్పిట్లోకి వెళ్ల‌కుండా ఉండే దిశ‌గా శ‌క్తివంచ‌న లేకుండా ఆయ‌న‌ వ్యూహాలు ర‌చించారు. జెలెన్ స్కీ వ్యూహాల కార‌ణంగానే ఉక్రెయిన్‌కు ప్ర‌పంచ దేశాల మ‌ద్ద‌తుతో పాటు ర‌ష్యాపై ఆంక్ష‌ల ప‌రంప‌ర కొన‌సాగింది.

మరోపక్క, యుద్ధం మొద‌లైన తొలి రెండు రోజుల్లోనే జెలెన్ స్కీ భ‌య‌ప‌డి విదేశాల‌కు పారిపోయార‌ని ర‌ష్యా ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ర‌ష్యా చెప్పేదంతా అబ‌ద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించిన జెలెన్ స్కీ.. తాను ఉక్రెయిన్‌లోనే ఉన్న‌ట్లుగా వీడియో విడుద‌ల చేశారు. ఇలాంటి నేప‌థ్యంలో తాజాగా జెలెన్ స్కీ దేశం వ‌దిలి ప‌రార‌య్యారంటూ ర‌ష్యాకు చెందిన మీడియా క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ను వీడిన జెలెన్ స్కీ.. ప్ర‌స్తుతం పోలండ్‌లో ఉన్నార‌ని కూడా ర‌ష్యా మీడియా చెబుతోంది. మ‌రి ఈ వార్త‌ల్లో ఏ మేర నిజ‌ముంద‌న్న విష‌యం తేలాల్సి ఉంది.


More Telugu News