ఇప్ప‌టికే మూడు సార్లు.. ఉక్రెయిన్ అధ్య‌క్షుడి హ‌త్య‌కు కుట్ర‌.. విఫలం!

  • చెచెన్ స్పెష‌ల్ ఫోర్స్‌తో పాటు వార్న‌ర్ గ్రూప్ రంగంలోకి
  • మూడు కుట్ర‌ల‌ను భ‌గ్నం చేసిన ఉక్రెయిన్ భ‌ద్ర‌తా ద‌ళాలు
  • ఉక్రెయిన్ చేతిలో ప‌లువురు వార్న‌ర్ గ్రూప్ స‌భ్యుల హ‌తం
  • లండ‌న్‌లోని అంత‌ర్జాతీయ వేదిక వెల్ల‌డి
ఉక్రెయిన్‌పై యుద్ధోన్మాదంతో భీక‌ర దాడులు చేస్తున్న ర‌ష్యా.. ఏకంగా ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీని హ‌త్య చేసేందుకు కూడా తీవ్రంగానే య‌త్నించింద‌ట‌. అయితే ఉక్రెయిన్ శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను ఎలాగైతే త‌క్కువ‌గా అంచ‌నా వేసిందో..జెలెన్‌స్కీకి ఉన్న భ‌ద్ర‌త‌ను కూడా ర‌ష్యా త‌క్కువ‌గానే అంచ‌నా వేసిన‌ట్టు ఉంది. 

ర‌ష్యా అధ్య‌క్ష భ‌వ‌నం నుంచే ఆదేశాలు రాగా..జెలెన్ స్కీని హ‌త్య చేసేందుకు చెచెన్ స్పెష‌ల్ ఫోర్స్‌తో పాటు ప‌లు దేశాల నిషేధిత సంస్థ‌ల జాబితాలో ఉన్న‌ ర‌ష్యా ప్రైవేట్ ఆర్మీ వాగ్న‌ర్ గ్రూప్ కూడా రంగంలోకి దిగింద‌న్న వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఈ మేర‌కు లండ‌న్‌కు చెందిన ఓ అంత‌ర్జాతీయ సంస్థ ఈ కుట్ర‌కు సంబంధించి ప‌లు అంశాల‌ను వెల్ల‌డించింది.

ర‌ష్యా సైన్యంలో ప‌నిచేసి రిటైర్ అయిన వారితో ర‌ష్యా అధ్య‌క్ష భ‌వ‌నం ఓ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసిందట‌. ఆ ద‌ళంలో ప్ర‌స్తుతం 6 వేల మంది దాకా స‌భ్యులుండ‌గా.. ర‌ష్యా పొరుగు దేశాల్లో ఈ సైన్యం అరాచ‌కాలు పెరిగిపోయిన నేప‌థ్యంలో అమెరికాతో పాటు యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాలు కూడా ఈ సైన్యాన్ని నిషేధిత సంస్థ‌ల జాబితాలోకి చేర్చాయి. అయినా కూడా ర‌ష్యా అధ్యక్ష భ‌వ‌నం తన ప‌నుల కోసం ఈ ప్రైవేట్ సైన్యాన్ని వినియోగిస్తూనే ఉంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హ‌త్య‌కు రంగంలోకి దిగిన చెచెన్ స్పెష‌ల్ ఫోర్స్ ఓ సారి జెలెన్‌స్కీని హ‌త్య  చేసేందుకు య‌త్నించ‌గా..ఉక్రెయిన్ భ‌ద్ర‌తా ద‌ళాలు తిప్పికొట్టాయ‌ట‌. అదే సమ‌యంలో వార్న‌ర్ గ్రూప్ రెండు సార్లు జెలెన్ స్కీని హ‌త్య చేసేందుకు య‌త్నించ‌గా.. వాటిని కూడా ఉక్రెయిన్ ద‌ళాలు తిప్పికొట్టాయి. 

ఈ సంద‌ర్భంగా ఉక్రెయిన్ ద‌ళాల చేతిలో ప‌లువురు వార్న‌ర్ గ్రూప్ స‌భ్యులు మృతి చెందార‌ట‌. ఈ మేర‌కు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు తెలిపాయి. యుద్ధాన్ని వ్య‌తిరేకించే ర‌ష్యాలోని ఫెడ‌ర‌ల్ సెక్యూరిటీ స‌ర్వీసెస్ సంస్థ కూడా జెలెన్ స్కీపై జ‌రుగుతున్న హ‌త్యా య‌త్నాల‌కు సంబంధించి ఉక్రెయిన్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేయ‌డం కూడా జెలెన్ స్కీ ఆ దాడుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి వీలైంద‌న్న‌ వార్తలు వినిపిస్తున్నాయి.


More Telugu News