సూర్యను బోయపాటి లైన్లో పెట్టినట్టే!
- 'అఖండ'తో బోయపాటి సంచలనం
- నెక్స్ట్ మూవీ రామ్ తో
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్
- స్ట్రయిట్ తెలుగు సినిమా చేయనున్న సూర్య
'అఖండ' సినిమాతో సంచలన విజయాన్ని సాధించిన బోయపాటి, ఆ తరువాత సినిమాను అల్లు అర్జున్ తో చేయాలనుకున్నాడు. అయితే 'పుష్ప' సీక్వెల్ వెంటనే చేయాలనే నిర్ణయానికి అల్లు అర్జున్ వచ్చినప్పుడు, మరో కథతో మరో హీరోతో సెట్స్ పైకి వెళ్లాలని బోయపాటి అనుకున్నాడు. ఆ సమయంలోనే సూర్య పేరు వినిపించింది.
నేరుగా ఒక తెలుగు సినిమా చేయాలని సూర్య చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. అందువలన ఆయనను బోయపాటి సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. పైగా సూర్య కోరుకునేది కూడా మాస్ యాక్షన్ సినిమాలే కావడంతో, ఈ కాంబినేషన్ సెట్ కావడం ఖాయమనే అంతా అనుకున్నారు. కానీ ఈ లోగానే రామ్ తో బోయపాటి ప్రాజెక్టు ఖాయమైంది.
అయితే ఇక సూర్యతో సినిమా ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ సూర్యతో తన సినిమా ఉంటుందనీ, అయితే ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేనని 'ఈటి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బోయపాటి చెప్పాడు. పైగా రజనీ తరువాత తెలుగువారితో మనవాడు అనిపించుకున్న హీరో సూర్యనే అని కితాబు కూడా ఇచ్చాడు. మొత్తానికి ఆయన సూర్యను లైన్లో పెట్టిన విషయం మాత్రం అందరికీ అర్థమైంది.