పీకే మాజీ సహచరుడికి కాంగ్రెస్ ‘ప్రచార వ్యూహాల’ బాధ్యతలు

  • రాహుల్ గాంధీతో భేటీ అయిన సునీల్ కనుగోలు
  • అనంతరం బాధ్యతల అప్పగింత
  • 2023 తెలంగాణ ఎన్నికల నుంచి పని ప్రారంభం
  • వెల్లడించిన పార్టీ వర్గాలు
ప్రముఖ ఎన్నికల ప్రచార, వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) మాజీ సహచరుడైన సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. భవిష్యత్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కావాల్సిన ప్రచార వ్యూహాలను సునీల్ కనుగోలు రూపొందించనున్నారు. 

సునీల్ కనుగోలు గతంలో ప్రశాంత్ కిషోర్ కు చెందిన కన్సల్టెన్సీ ‘ఐ ప్యాక్’లో కీలకంగా పనిచేశారు. బీజేపీ, డీఎంకే, అన్నాడీఎంకే, అకాలీదళ్ పార్టీలకు ఆయన సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సునీల్ ఇటీవలే సమావేశమయ్యారు. అనంతరం భవిష్యత్తు ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రచార ప్రణాళిక బాధ్యతలను సునీల్ కు అప్పగించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 

2023లో జరగనున్న తెలంగాణ ఎన్నికల నుంచి సునీల్ తన సేవలను కాంగ్రెస్ పార్టీకి అందించనున్నారు. పశ్చిమబెంగాల్ లో తృణమూల్ పార్టీకి ప్రచార సేవలు అందించి, గెలుపులో కీలక పాత్ర పోషించిన పీకే.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశం కావడం తెలిసిందే. కాంగ్రెస్ లో కీలక పదవిని పీకే ఆశించారు. ఇచ్చేందుకు రాహుల్, ప్రియాంక సుముఖంగానే ఉన్నా, పార్టీలో ఇతర సీనియర్ నేతలు అభ్యంతరం పెట్టడంతో అది సాధ్యం కాలేదు. దీంతో పీకే తిరిగి కాంగ్రెస్ పార్టీపైనే విమర్శలు చేసి దూరమవడం తెలిసిందే.


More Telugu News