ఇంట్లో బాణసంచా తయారీ.. భారీ పేలుడు జరిగి 8 మంది దుర్మరణం

  • బీహార్ లోని బాఘల్ పూర్ లో దారుణ ఘటన
  • 12 మందికి తీవ్రగాయాలు
  • రెండు కిలోమీటర్ల వరకు వినిపించిన పేలుళ్ల శబ్దాలు  
బీహార్ లోని బాఘల్ పూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారు చేస్తున్న ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరు నెలల చిన్నారి సహా 8 మంది దుర్మరణం చెందారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు ధాటికి మూడంతస్తుల బిల్డింగ్ నేలమట్టం అయింది. దానికి ఆనుకుని ఉన్న మరో మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి.  

కాగా, కూలిన భవనం శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బాఘల్ పూర్ ఎస్పీ బాబూ రామ్ తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. నవీన్ ఆతిష్బాజ్ అనే వ్యక్తి ఇంట్లో టపాసులను తయారు చేస్తున్నారని, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టపాసులు ఒక్కసారిగా పేలాయని చెప్పారు. గురువారం రాత్రి 11.35 గంటల సమయంలో పేలుళ్లు జరిగినట్టు స్థానికులు చెప్పారు. దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. 

ఆతిశ్బాజ్ ఇంటి శిథిలాలు తమ ఇంటి మీద పడి తమ కుటుంబ సభ్యులు ఇద్దరు చనిపోయారని పింకీ కుమార్ అనే మహిళ రోదించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని కలెక్టర్ సుబ్రత్ కుమార్ సేన్ చెప్పారు.


More Telugu News