అదిగానీ పేలితే యూరప్ అంతమే.. అణు రియాక్టర్ మీద రష్యా దాడిపై జెలెన్ స్కీ స్పందన

  • ఇకనైనా ఐరోపా దేశాలు మేల్కోవాలి
  • ఉగ్రవాద దేశం న్యూక్లియర్ టెర్రర్ కు తెరలేపింది
  • పక్కా ప్లాన్ ప్రకారమే జపోరిఝియా ప్లాంట్ పై ఎటాక్
  • ఉక్రెయిన్ లో 15 న్యూక్లియర్ బ్లాకులున్నాయి
  • దాడి జరిగిన ప్లాంట్ పేలితే అన్నింటికీ నష్టమే
  • యూరప్ లో ఎవరూ మిగలరని ఉక్రెయిన్ అధ్యక్షుడి హెచ్చరిక
జపోరిఝియాలోని అణు ప్లాంట్ లోని రియాక్టర్ మీద రష్యా దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ స్పందించారు. అది ‘న్యూక్లియర్ టెర్రర్’ అని అన్నారు. దాని వల్ల కలిగే నష్టాలను ఇప్పుడే చెప్పలేమని, ఆ పెను నష్టం జరగకుండా దేవుడే ఆపాలని ఆయన పేర్కొన్నారు. ఇంత నష్టం జరుగుతుందని ఎవరూ లెక్కలేసి చెప్పలేరన్నారు. అణు కేంద్రంపై దాడి జరిగినట్టు తెలిసిన వెంటనే ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

‘‘మన చరిత్రలో, మానవాళి చరిత్రలో తొలిసారి ఉగ్రవాద దేశం అణు భయాలను సృష్టిస్తోంది. ప్రపంచాన్ని అణ్వస్త్ర దాడి చేసి బూడిదలో కప్పేస్తామంటూ గత కొంతకాలం నుంచే రష్యా బెదిరిస్తోంది. ఇప్పుడు జరిగింది హెచ్చరిక కాదు.. నిజం’’ అని అన్నారు. దాడి జరిగిన న్యూక్లియర్ ప్లాంట్ ఎప్పుడు పేలేది ఎవరికీ తెలియదన్నారు. 

ఇప్పటికైనా యూరప్ మేలుకోవాలని ఆయన కోరారు. ‘‘ఉక్రెయిన్ లో 15 న్యూక్లియర్ బ్లాక్ లు ఉన్నాయి. ఇప్పుడుగానీ దాడి జరిగిన ప్లాంట్ లో పేలుడు జరిగితే యూరప్ అంతమైపోయినట్టే. అంతా చచ్చిపోతారు’’ అని ఆయన హెచ్చరించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే రష్యా ఈ దాడి చేసిందన్నారు. రష్యా యుద్ధ ట్యాంకులకు థర్మల్ ఇమేజ్ స్కానర్లున్నాయని, కాబట్టి ఈ దాడి ప్రమాదవశాత్తూ జరిగింది కాదని తేల్చి చెప్పారు. దేనిపై షూట్ చేస్తున్నారో రష్యా సైనికులకు పక్కాగా తెలుసన్నారు. 

‘‘యూరప్ ఇకనైనా మేల్కోవాలి. యూరప్ లోనే అతిపెద్ద అణు పవర్ ప్లాంట్ ఇప్పుడు మంటల్లో ఉంది. న్యూక్లియర్ బ్లాకులపై రష్యా దాడులు చేస్తోంది. అన్నింటికీ తెగించే ఈ దాడులకు పాల్పడుతోంది. చెర్నోబిల్ అనే పదం అందరికీ తెలిసే ఉంటుంది. అది పేలినప్పుడు ఎంత మంది చనిపోయారో, ఎంత నష్టం జరిగిందో తెలుసు కదా. ఇప్పుడు దానికి ఆరు రెట్ల తీవ్రమైన దాడిని చేసేందుకు రష్యా దాడులు చేస్తోంది’’ అని జెలెన్ స్కీ హెచ్చరించారు.


More Telugu News