'హనుమాన్' నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ లుక్!

  • వరలక్ష్మి శరత్ కుమార్ కి మంచి క్రేజ్ 
  • తమిళంతో పాటు తెలుగులోను బిజీ
  • 'హనుమాన్'లో అంజమ్మ పాత్ర 
  • తేజ సజ్జ జోడీగా అమృత అయ్యర్
తమిళంలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలకు వరలక్ష్మి శరత్ కుమార్ పెట్టింది పేరు. నేరుగా స్టార్ హీరోలతోనే తలపడే విలనిజం ఆమె సొంతం. ఈ కారణంగానే తెలుగు నుంచి కూడా ఆ తరహా పాత్రలు ఆమెకు వెళుతున్నాయి. 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' .. 'క్రాక్' .. 'నాంది' సినిమాలు అందుకు ఉదాహరణగా కనిపిస్తాయి. ఈ సినిమాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. 

ఇక బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాలోను, 'హనుమాన్' సినిమాలోను ఆమె చేస్తుందనే టాక్ వినిపించింది. తాజాగా 'హనుమాన్' నుంచి ఆమె ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. 'అంజమ్మ' అంటూ ఆమె పాత్ర పేరును కూడా పరిచయం చేశారు. ఈ పోస్టర్ లో ఆమె పెళ్లి కూతురు లుక్ తో కొబ్బరి గెల పట్టుకుని రౌడీలను ఉతికి ఆరేసే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.  

అంజనాద్రి నేపథ్యంలో ఈ సన్నివేశం జరుగుతున్నట్టుగా చూపించారు. బహుశా ఆమె కథానాయకుడికి తల్లి పాత్రను ధరించి ఉంటుందని అనుకోవచ్చు. తేజ సజ్జ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన జోడీగా అమృత అయ్యర్ అలరించనుంది. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.


More Telugu News