తిరిగి అన్నాడీఎంకే గూటికి శశికళ.. రేపు తీర్మానం!

  • జయలలిత మరణానంతరం పార్టీలో వర్గపోరు
  • పార్టీని చేతుల్లోకి తీసుకుందామనుకున్న శశికళ జైలుకు
  • అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి
  • శశికళ పార్టీలోకి వస్తే గాడిన పడుతుందని ఆశ
జయలలిత మరణానంతరం తమిళనాడులో అన్నాడీఎంకే పరిస్థితి దారుణంగా తయారైంది. వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఆమె మరణం తర్వాత పార్టీని గుప్పిట్లోకి తీసుకున్న పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు పార్టీని గాడినపెట్టలేకపోయారు. పార్టీని హస్తగతం చేసుకోవాలని భావించిన జయలలిత నెచ్చెలి శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లడం పార్టీని మరింత దెబ్బతీసింది. ఆ తర్వాత పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య విభేదాలు, ఇతరత్రా కారణాలతో పార్టీపై ప్రజల్లో అభిమానం సన్నగిల్లింది. వర్గ పోరు పార్టీ ఓటమికి కారణమైంది. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణ ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం మేలన్న అభిప్రాయాన్ని అటు నేతలు, ఇటు కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. తేని జిల్లా పెరియకుళం కైలాసపట్లిలోని అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్ సెల్వానికి చెందిన ఫామ్‌హౌస్‌లో బుధవారం జరిగిన సమావేశంలో పలువురు అన్నాడీఎంకే ముఖ్య సహాయకులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పార్టీ ఓటమి, వర్గ పోరు గురించి చర్చించారు. శశికళ మళ్లీ అన్నాడీఎంకేలోకి వస్తే తప్ప పార్టీ నిలదొక్కుకోవడం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శశికళను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంపై రేపు తీర్మానం ఆమోదించి పార్టీ అధిష్ఠానానికి పంపాలని ఈ సమావేశంలో నిర్ణయంచారు. 

అయితే, పన్నీర్ సెల్వం సమక్షంలో ఆమోదించిన ఈ తీర్మానంపై ఎడప్పాడి వర్గం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో ఎడప్పాడి వర్గం సానుకూలంగా స్పందించి శశికళను తిరిగి పార్టీలోకి తీసుకుంటే తమిళ రాజకీయాలు మళ్లీ వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.


More Telugu News