రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కాల్పుల కేసును ఛేదించిన రాచకొండ పోలీసులు

  • మంగళవారం నాడు ఘటన
  • ఇబ్రహీంపట్నం వద్ద కాల్పులు
  • ఇద్దరు రియల్టర్ల మృతి
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఇబ్రహీంపట్నం రియల్టర్లు శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డిలను ప్రత్యర్థులు తుపాకీ తూటాలకు బలిచేయడం తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గొడవలే వీరి హత్యకు దారి తీశాయని రాచకొండ పోలీసుల విచారణలో తేలింది. నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వివరాలు తెలిపారు. 

ఈ కేసులో మట్టారెడ్డి, ముజాహిదీన్, భిక్షపతి, అశోక్ రెడ్డి, రహీమ్, షమీమ్ నిందితులు అని వెల్లడించారు. వీరిలో మట్టారెడ్డి పాతనేరస్తుడు అని తెలిపారు. మట్టారెడ్డిపై తమకు అనుమానాలు రాగా, అతడు విచారణకు సహకరించలేదని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అయితే అతడి గెస్ట్ హౌస్ నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజిలో కీలక ఆధారం లభించిందని వివరించారు.

ఈ కాల్పుల ఘటనకు ప్లాన్ వేసింది మట్టారెడ్డేనని, తుపాకులు, తూటాలు బీహార్ లో కొనుగోలు చేశారని వెల్లడించారు. శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డిలపై కాల్పులు జరిపింది ముజాహిద్దీన్, భిక్షపతి అని తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 2 తుపాకులు, 6 కత్తులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 48 గంటల్లో ఈ కేసును ఛేదించామని సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.


More Telugu News