పెళ్లి చేసుకున్న మరుసటి రోజే యుద్ధరంగంలోకి దూకిన ఉక్రెయిన్ కొత్త జంట

  • పెళ్లితో ఒక్కటైన అరియేవా, స్వియతోస్లావ్
  • సైనికులతో కలిసి రష్యాపై పోరాడుతున్న స్వియతోస్లావ్
  • కీవ్ లో స్వచ్ఛంద సేవలు అందిస్తున్న అరియేవా
  • దేశం కోసం ప్రాణాలు లెక్కచేయని కొత్త దంపతులు
పెళ్లి చేసుకుని నిండు నూరేళ్లు కాపురం జీవించాల్సిన ఆ కొత్త జంట తుపాకీ చేతబట్టి దేశ రక్షణ కోసం ముందుకురికింది. ఇదెక్కడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. రష్యా దురాక్రమణను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ లో ప్రస్తుతం ఇలాంటి దేశభక్తిపూరిత ఉదంతాలు దర్శనమిస్తున్నాయి. యరైనా అరియేవా, స్వియతోస్లావ్ ఫుర్సిన్ ఇటీవలే పెళ్లితో ఒక్కటయ్యారు. ఎన్నో మధురమైన ఊహలతో కొత్త జీవితం ప్రారంభించాల్సిన ఆ జంట... ప్రాణాలను కూడా లెక్కచేయకుండా, పెళ్లయిన మరుసటిరోజే యుద్ధరంగానికి తరలి వెళ్లింది. 

రష్యా దురాక్రమణకు తెరదీసిన తొలిరోజు అరియేవా, ఫుర్సిన్ ల వివాహం జరిగింది. కానీ తమ వైవాహిక జీవితం కంటే దేశమే ముఖ్యమని భావించిన వారిద్దరూ తుపాకులు ధరించి ఉక్రెయిన్ రక్షణ బాధ్యతల్లోకి కాలు మోపారు. కొత్త పెళ్లికూతురు అరియేవా మాట్లాడుతూ "నా ఇల్లు, నా కుటుంబం, నాకిష్టమైన ప్రజానీకం... అన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకే నాకు మరో మార్గంలేదు. నా దేశాన్ని నేను కాపాడుకోవాలంతే!" అని దేశభక్తి ప్రదర్శించింది. 

అరియేవా భర్త స్వియతోస్లావ్ సైనికులతో కలిసి రష్యన్ దళాలతో పోరాడుతుండగా, అరియేవా కీవ్ నగరంలో స్వచ్ఛందంగా సేవలు అందిస్తోంది. యుద్ధరంగం నుంచి భర్త ఎప్పుడు వస్తాడో అని ఎదురుచూడడం ఎంతో కష్టంగా ఉందని ఆమె పేర్కొంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ఈ కష్టసమయంలో ప్రపంచదేశాల నుంచి తమకు మద్దతు కావాలని కోరింది. 

ఇక, కొత్త పెళ్లికొడుకు ఫుర్సిన్ స్పందిస్తూ, దేశాన్ని రక్షించుకోవడానికి ఎవరికి తోచింది వారు చేస్తున్నామని చెప్పాడు. దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతిదీ చేస్తున్నామని తెలిపాడు. 

వాస్తవానికి అరియేవా, స్వియతోస్లావ్ మే 6న పెళ్లి చేసుకుని, ఓ రెస్టారెంట్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అయితే, రష్యాతో యుద్ధ వాతావరణం కారణంగా ముందే ఒక్కటయ్యారు. పరిస్థితులు చక్కబడితే త్వరలోనే రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని వారు చెబుతున్నారు. కాగా, వీరిద్దరికీ సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. చూడముచ్చటగా ఉన్న ఈ జంటకు నెటిజన్లు నీరాజనాలు పడుతున్నారు.


More Telugu News