రేపు పోల‌వ‌రానికి జ‌గ‌న్‌.. కేంద్ర మంత్రితో క‌లిసి ప్రాజెక్టు ప‌రిశీల‌న‌

  • ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభం కానున్న ప‌ర్య‌ట‌న‌
  • సాయంత్రం 5.30 గంట‌ల‌కు టూర్ ముగింపు
  • రాత్రికి కేంద్ర మంత్రికి విందు ఇవ్వ‌నున్న జ‌గ‌న్‌
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం నాడు పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌రిశీల‌న‌కు వెళుతున్నారు. రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ తో క‌లిసి జ‌గ‌న్ పోలవ‌రం ప్రాజెక్టును ప‌రిశీలిస్తారు. ప్రాజెక్టు ప‌రిశీల‌న‌తో పాటుగా పున‌రావాస కాల‌నీ వాసుల‌తోనూ జ‌గ‌న్ మాట్లాడ‌నున్నారు. ఈ మేర‌కు జ‌గ‌న్ పోల‌వ‌రం సంద‌ర్శ‌న‌కు సంబంధించిన షెడ్యూల్‌ కాసేప‌టి క్రితం విడుద‌ల అయింది. 

గురువారం రాత్రికి విజ‌య‌వాడ చేరుకోనున్న గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌కు జ‌గ‌న్ రాత్రి విందు ఏర్పాటు చేస్తారు. ఆ త‌ర్వాత శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు- 1 పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో జ‌గ‌న్‌, షెకావ‌త్‌లు మాట్లాడతారు.

ఆ తర్వాత 11.20 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి 12.30 గంటలకు పోలవరం డ్యామ్‌ సైట్‌ చేరుకుని పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు పోలవరం డ్యామ్‌ సైట్‌ నుంచి తిరిగి బయలుదేరి 5.30 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకుంటారు.


More Telugu News