యూపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై దీదీ జోస్యం ఇదే!

  • వార‌ణాసిలో ఎస్పీకి మ‌ద్ద‌తుగా దీదీ ప్ర‌చారం
  • దీదీని అడ్డుకునేందుకు య‌త్నించిన బీజేపీ శ్రేణులు
  • ఓడిపోతున్న‌ట్లు బీజేపీ నేత‌ల‌కు తెలిసిపోయింద‌న్న బెంగాల్ సీఎం
  • బెదిరింపుల‌కు తాను భ‌య‌ప‌డ‌బోన‌ని ప్ర‌క‌ట‌న‌
జాతీయ రాజ‌కీయాల‌ను శాసించే స్థితిలో ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. అధికార బీజేపీ, విప‌క్ష స‌మాజ్ వాదీ పార్టీల మ‌ధ్య నువ్వా, నేనా అన్న రీతిలో ఎన్నిక‌ల ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే 5 విడ‌త‌ల‌ ఎన్నిక‌లు ముగియ‌గా.. గురువారం నాడు ఆరో ద‌శ పోలింగ్ జ‌రిగింది.

ఓ వైపు ఆరో విడ‌త పోలింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే స‌మాజ్ వాదీ పార్టీ అభ్య‌ర్థుల విజ‌యం కోసం ప్ర‌చారం చేసే నిమిత్తం తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సొంత నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసిలో ప్ర‌చారం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె యూపీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై జోస్యం చెప్పారు. 

యూపీ ఎన్నిక‌ల్లో స‌మాజ్ వాదీ పార్టీ విజ‌యం ఖ‌రారైపోయింద‌ని, బీజేపీకి ప‌రాభ‌వం త‌ప్ప‌దని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన దీదీ.. ప‌రాజ‌యంపై ఇప్ప‌టికే బీజేపీ నేత‌ల‌కు అర్థ‌మైపోయింద‌ని కూడా చెప్పారు. వార‌ణాసికి వ‌స్తున్న త‌న‌ను అడ్డుకునేందుకు బీజేపీ కార్య‌క‌ర్త‌లు య‌త్నించార‌ని.. ఈ ఒక్క ఘ‌ట‌న‌తోనే త‌మ‌కు ఓట‌మి ఖ‌రారైపోయిన‌ట్లుగా బీజేపీ నేత‌లే చెప్పేసిన‌ట్లయిందని ఆమె వ్యాఖ్యానించారు. 

అయినా ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసేందుకు వ‌చ్చిన త‌న‌ను అడ్డుకోవాల్సిన అవ‌స‌రం బీజేపీకి ఏముంద‌ని కూడా దీదీ ప్ర‌శ్నించారు. ఈ త‌ర‌హా బెదిరింపుల‌కు తాను భ‌య‌ప‌డేది లేద‌ని, వామ‌పక్ష పార్టీల‌తోనే ఏళ్ల త‌ర‌బ‌డి పోరాటం చేసిన త‌న‌ను బీజేపీ శ్రేణులు భ‌య‌పెట్ట‌లేవ‌ని దీదీ వ్యాఖ్యానించారు.


More Telugu News