అభిమానంతో ఓట్లు వేసి గెలిపించిన‌ ప్ర‌జ‌ల‌ను చీట్ చేయ‌కూడదు: మేకపాటి రాజమోహన్ రెడ్డి

  • ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టే నాయ‌కుడు ఉండ‌రాదు
  • ప్ర‌జ‌ల సొమ్ముకు పాల‌కులు ధ‌ర్మ‌క‌ర్త‌లే
  • ప్ర‌జ‌ల సొమ్మును ప్ర‌జ‌ల‌కే అప్ప‌గించాలి
  •  పరిశ్రమలు వచ్చేలా చూడమని మా అబ్బాయికి చెప్పేవాడినన్న మేకపాటి 
చెట్టంత కుమారుడు చ‌నిపోయిన దుఃఖంలో కూరుకుపోయిన మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డికి ఏపీ సీఎం జ‌గ‌న్ కొండంత అండ‌గా నిలుస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. త‌మ కాలేజీని ప్ర‌భుత్వానికి ఇస్తాం.. దానిని అగ్రిక‌ల్చ‌ర‌ల్ యూనివ‌ర్సిటీగా మార్చి త‌న కుమారుడి పేరు పెట్టాల‌ని మేక‌పాటి కోరిందే త‌డ‌వుగా జ‌గ‌న్ ఓకే చెప్పేశారు.  

ఇదిలావుంచితే, మేకపాటి మాట్లాడిన ఓ వీడియో గురువారం నాడు పెను దుమార‌మే రేపుతోంది. అభిమానంతో ఓట్లు వేసి గెలిపించిన‌ ప్ర‌జ‌ల‌ను చీట్ చేయ‌రాద‌ని, ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌రాద‌ని పేర్కొన్న మేక‌పాటి.. అస‌లు అలాంటి నాయ‌కుడు ఉండ‌రాదంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు.  

జ‌గ‌న్ మంచి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు క‌గిలిన నేత అని.. వాళ్ల నాన్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి లేని లోటును తీరుస్తాడ‌ని చెప్పిన తాను.. ఒక్క అవ‌కాశం ఇచ్చి చూడండి.. మ‌ళ్లీ అవ‌కాశం రానే వ‌స్తుంద‌ని తాను చెప్పిన మాట‌ల‌ను జ‌నం న‌మ్మార‌ని, జ‌గ‌న్‌ను భారీ మెజారిటీతో గెలిపించార‌ని మేక‌పాటి చెప్పారు. ఆయన ఇంకా మంచి కార్యక్రమాలు చేసి నిలబెట్టుకోవాలన్నారు.

ప్రజల సొమ్ముకు పాలకులు ధర్మకర్తలే.. కానీ, సొంత దారులం కాదని మేక‌పాటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రజల సొమ్మును ప్రజలకే అప్పగించాలని సూచించిన ఆయన.. ప్రజలకు విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు ఇలా అన్ని కార్యక్రమాలు చేయాలన్నారు. అసలే, రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన మేకపాటి.. రాష్ట్రం బాగుపడాలంటే.. బాగా పనిచేయాలని గౌతమ్‌రెడ్డికి సూచించానని గుర్తుచేసుకున్నారు. 

ఆదాయం తెచ్చే శాఖ నీదే.. జాగ్రత్తగా పనిచేయి.. పరిశ్రమలు వచ్చేలా చూడు.. రాష్ట్రం అభివృద్ధి చెందాలని గౌతమ్‌కు చెప్పానని వెల్లడించారు. ఈ వీడియో ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.


More Telugu News