ఏపీ చరిత్రలో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది... వైసీపీ సర్కారు పంతానికి పోకూడదు: నాగబాబు

  • అమరావతి రాజధానిపై హైకోర్టు కీలక తీర్పు
  • మాస్టర్ ప్లాన్ అమలుకు ఆదేశాలు
  • ఇదే అంతిమ తీర్పు అనుకోవాలని సూచించిన నాగబాబు 
  • సుప్రీంకోర్టుకు వెళ్లొద్దని స్పష్టీకరణ
అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో మెగాబ్రదర్, జనసేన నేత నాగబాబు స్పందించారు. ఏపీ రాష్ట్ర చరిత్రలోనే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిందని నాగబాబు అన్నారు. సుమారు 800 రోజులకు పైగా మొక్కవోని దీక్ష చేస్తున్న అమరావతి రైతులు, మహిళలు, అందరి విజయం ఇదని పేర్కొన్నారు. 

"గతంలో అధికార టీడీపీ అమరావతిని రాజధానిగా ప్రతిపాదించగా, వైసీపీ కూడా ఒప్పుకుంది. అమరావతే రాజధాని అవుతుందని నమ్మి రైతులు తమ భూములు అప్పగించారు. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించింది. మూడు రాజధానుల కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చారు.

అమరావతి ఉద్యమాన్ని వైసీపీ మంత్రులు కానీ, వారి నేతలు కానీ ఎన్నో మాటలు అన్నారు. స్పాన్సర్డ్ ఉద్యమం అని, స్వార్థపరుల ఉద్యమం అని అన్నారు. ఇన్ని రోజుల పాటు చేసే ఉద్యమాలు కడుపు రగిలితేనే వస్తాయి తప్ప స్పాన్సర్లతో రావు. అమరావతి ఉద్యమానికి మా జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంతో మద్దతు ఇచ్చాం. 

హైకోర్టు తీర్పు నేపథ్యంలో మేం కూడా చాలా సంతోషిస్తున్నాం. అమరావతి ఓ రాజధానిగా ఏర్పడే తరుణం వచ్చిందనుకుంటున్నాం. ఇక వైసీపీ నేతలకు నేను చెప్పేది ఏంటంటే... హైకోర్టు తీర్పునే అంతిమ తీర్పు అనుకోండి. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళతారేమో... అక్కడ కూడా రాజధాని ప్రాంత రైతులకే అనుకూల తీర్పు రావడం ఖాయం. 

వైసీపీ ప్రభుత్వం పంతాలకు పోకూడదు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలతో శత్రుత్వం పెట్టుకుంటే నిలబడడం కష్టం. ఎవరితోనైనా పెట్టుకోండి కానీ ప్రజల జోలికి వెళ్లొద్దు. కానీ మీరు అలాంటి తప్పు చేశారు. ఇకనైనా తప్పుదిద్దుకోండి. హైకోర్టు తీర్పును గౌరవించి, అమరాతి రైతుల మనోవేదనను తగ్గించేలా ముందుకు వెళ్లండి. 

రాజధాని అనేది అమరావతి పరిసరాల్లోని ప్రజలకు మాత్రమే చెందింది కాదు, రాష్ట్రం మొత్తానికి చెందిన రాజధాని. ఇది ప్రజల విజయం. భారతదేశంలో న్యాయవ్యవస్థలు ఇంకా పటిష్ఠంగా ఉన్నాయని చెప్పడానికి హైకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పే నిదర్శనం" అని నాగబాబు స్పష్టం చేశారు.


More Telugu News