పుడమి కోసం.. లండన్ నుంచి భారత్ కు జగ్గీ వాసుదేవ్ మోటార్ సైకిల్ యాత్ర

  • 100 రోజుల పాటు సద్గురు ఒక్కరే పర్యటన
  • 27 దేశాల పరిధిలో 30,000 కిలోమీటర్ల ప్రయాణం
  • భూసారాన్ని కాపాడాలంటూ ప్రచారం
  • ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని పిలుపు
సద్గురు జగ్గీ వాసుదేవ్ నేలతల్లి కోసం ఖండాంతర మోటారు సైకిల్ యాత్రకు నడుం కట్టనున్నారు. భూసారాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేసేందుకు లండన్ నుంచి భారత్  వరకు 100 రోజుల పాటు మోటారు సైకిల్ పై తాను ఒక్కడినే యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. 

తన యాత్రలో భాగంగా పర్యటించిన ప్రతి దేశంలో నేల భూసారాన్ని పరిరక్షించేందుకు విధానపరమైన చర్యలు తీసుకోవాలంటూ అక్కడి పాలకులను కోరనున్నట్టు సద్గురు తెలిపారు. 100 రోజుల యాత్రలో భాగంగా 27 దేశాల పరిధిలో 30,000 కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణం చేయనున్నారు. 

‘‘ఈ 100 రోజుల్లో ప్రతి ఒక్కరు ప్రతి రోజు కనీసం 5-10 నిమిషాల పాటు నేల గురించి మాట్లాడాలి. ఇది ఎంతో ముఖ్యమైనది. ప్రపంచం మొత్తం 100 రోజుల పాటు భూమి గురించి మాట్లాడాలి. శాస్త్రవేత్తలతో పాటు, ఐక్యరాజ్యసమితి  ఏజెన్సీలు మరో 55 ఏళ్లపాటే సాగు చేసుకోవడానికి అనుకూలంగా భూమి ఉంటుందని చెబుతున్నాయి. ఆహార కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. 

ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలి. భూమి అన్నది ఒక అద్భుతం. చనిపోతే నేలలోనే పాతిపెడతారు. అక్కడే ప్రాణం కూడా మొలకెత్తుతుంది. మనం భూమి నుంచే ఉద్భవిస్తాం. భూమిపై ఉన్న దానినే తింటాం. చనిపోతే తిరిగి అదే భూమిలోకి చేరతాం’’ అని సద్గురు చెప్పారు. (వీడియో లింక్)


More Telugu News