భారత విద్యార్థులను నిందించడం మాని తరలింపుపై దృష్టి పెట్టండి: కేంద్రానికి సీఎం స్టాలిన్ హితవు

  • ఉక్రెయిన్ పై రష్యా భారీ దాడులు
  • ఉక్రెయిన్ లో విషమిస్తున్న పరిస్థితులు
  • భారీ సంఖ్యలో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు
  • పరిస్థితి తీవ్ర విచారం కలిగిస్తోందన్న స్టాలిన్
ఉక్రెయిన్ లో భారత విద్యార్థులు అత్యంత విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న వేళ, కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను నిందించడం సరికాదని తమిళనాడు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. విదేశాల్లో వైద్య విద్య అభ్యసించే విద్యార్థులను ఉద్దేశించి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం తెలిసిందే. దీనిపై సీఎం స్టాలిన్ సోషల్ మీడియాలో స్పందించారు. 

"ఉక్రెయిన్ లో ప్రస్తుతం భారత విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఉక్రెయిన్ లోని వివిధ ప్రాంతాల నుంచి బయటపడేందుకు విద్యార్థులు సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన దుస్థితిలో చిక్కుకున్నారన్న వార్తలు తీవ్ర విచారం కలిగిస్తున్నాయి. ఓవైపు విద్యార్థులు సైనిక దాడులు, సరిహద్దుల వద్ద కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటుంటే, కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను నిందిస్తోంది. కేంద్రం తీరు మార్చుకోవాలి. 

విద్యార్థులను తప్పుబట్టడం మాని, వారిని క్షేమంగా తరలించడంపై దృష్టి పెట్టాలి. భారత పాస్ పోర్టు కలిగిన ప్రతి ఒక్క పౌరుడి క్షేమం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్ర క్యాబినెట్ మంత్రులు నోటికొచ్చిన వ్యాఖ్యలు చేయకుండా ప్రధానమంత్రి కార్యాలయం కట్టడి చేయాలి" అని పేర్కొన్నారు.


More Telugu News