ఈ సారి 175 సీట్లూ వైసీపీవే: ఏపీ మంత్రి వెల్లంపల్లి

  • ముంద‌స్తు ఎన్నిక‌లు అంటూ టీడీపీ ప్ర‌క‌ట‌న‌
  • దానికి కౌంట‌ర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు వెల్లంపల్లి 
  • చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్న‌ల‌పై ఘాటు కామెంట్లు
వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం సీటు స‌హా ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ సీట్ల‌లో వైసీపీనే విజ‌యం సాధించ‌నుంద‌ని ఆ పార్టీ కీల‌క నేత, దేవా‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌లకు రెడీ కావాలంటూ టీడీపీ చేసిన ప్ర‌క‌ట‌న‌కు కౌంట‌ర్ ఇచ్చేందుకు బుధ‌వారం మీడియా ముందుకు వ‌చ్చిన మంత్రి.. సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఓడించ‌డం ఏ ఒక్క‌రి త‌రం కూడా కాద‌ని స్పష్టం చేశారు.  

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుతో పాటు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్, టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చెన్నాయుడుల‌పై వెల్లంపల్లి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబుకు పూర్తిగా మ‌తి భ్ర‌మించింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పంలోనూ ఆయ‌న ఓడిపోతార‌ని ఆయ‌న జోస్యం చెప్పారు.

నారా లోకేశ్ ను రాజ‌కీయాల్లో ఓ క‌మెడియ‌న్‌గా అభివ‌ర్ణించిన వెల్లంపల్లి... లోకేశ్ క‌నీసం వార్డు స‌భ్యుడిగా కూడా గెల‌వ‌లేర‌ని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీ ఏపీ అధ్య‌క్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు సొంత పార్టీపై తిరుప‌తిలో చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి గుర్తు చేశారు. అన్నం తినేట‌ప్పుడు ఎవ‌రూ అబద్ధాలు ఆడ‌ర‌ని, అందుకే టిఫిన్ చేస్తూ టీడీపీ ప‌ని అయిపోయిందంటూ నిజం మాట్లాడారన్నారు. ఇప్ప‌టికే ఏపీలో టీడీపీ కేడ‌ర్ చెల్లాచెదురు అయిపోయింద‌ని, కేడ‌ర్‌ను కాపాడుకునేందుకే టీడీపీ నేత‌లు ముంద‌స్తు ఎన్నిక‌లు అంటూ హ‌డావిడి చేస్తున్నార‌ని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు.


More Telugu News