దక్షిణ ఉక్రెయిన్ లో ఖేర్సన్ నగరాన్ని పూర్తిగా వశపర్చుకున్న రష్యా

  • దాడుల్లో తీవ్రత పెంచిన రష్యా
  • శక్తిమంతమైన క్షిపణులతో ఉక్రెయిన్ నగరాలపై దాడి
  • ఖేర్సన్ నగరంలో ముగిసిన ఉక్రెయిన్ పోరు
  • ఖార్కివ్ ను చేజిక్కించుకునే దిశగా రష్యా
  • రాజధాని కీవ్ లో అతిపెద్ద టీవీ టవర్ ధ్వంసం
ఉక్రెయిన్ విషయంలో రష్యా పంతం కొనసాగుతోంది. రాజధాని కీవ్ సహా అనేక నగరాలపై ఏకకాలంలో దాడులు చేస్తున్న రష్యా తాజాగా దక్షిణ ఉక్రెయిన్ లోని ఖేర్సన్ నగరంపై పూర్తిగా పట్టు సాధించింది. నగరంలో ఎక్కడ చూసినా రష్యా సాయుధ వాహనాలే కనిపిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఉక్రెయిన్ నగరాల దిశగా రష్యా అదనపు బలగాలను పంపుతోంది. భయానక దాడులతో ఉక్రెయిన్ ను అతలాకుతలం చేస్తోంది. 

అటు, రాజధాని కీవ్ పైనా రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఇక్కడి భారీ టీవీ టవర్ ను రష్యా సైన్యం పేల్చివేసింది. దాంతో కీవ్ లో టెలివిజన్ ప్రసారాలు నిలిచిపోయాయి. నిన్న క్షిపణి దాడులతో దద్దరిల్లిన ఖార్కివ్ లో పరిస్థితి ఏమీ మారలేదు. ఇవాళ ఖార్కివ్ నగరంలో పోలీసు కార్యాలయంపై రష్యా సేనలు దాడులకు పాల్పడ్డాయి. ఖార్కివ్ నగరంలో నిన్న జరిగిన క్షిపణి దాడిలో భారతీయ విద్యార్థి నవీన్ సహా 21 మంది మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనలో 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.

ఇదిలావుంటే, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ తమ బలగాలు రష్యా దాడులను తిప్పికొడుతున్నాయని ప్రకటించారు. ఉక్రెయిన్ దళాల చేతిలో 6 వేలమంది రష్యా సైనికులు హతమయ్యారని జెలెన్ స్కీ వెల్లడించారు. దూకుడుగా వస్తున్న రష్యా అందుకు మూల్యం చెల్లించుకుంటోందని అన్నారు.


More Telugu News