కాలినడకన ఉక్రెయిన్ నుంచి తప్పించుకున్న హాలీవుడ్ స్టార్

  • రోడ్డుపై వెళుతున్న ఫొటోను పోస్ట్ చేసిన శాన్ పెన్
  • మరో ఇద్దరితో కలిసి పోలెండ్ బార్డర్ కు
  • కారును రోడ్డు పక్కనే వదిలేసి పయనం
  • క్యూ కట్టిన కార్లలో పిల్లలు, మహిళలేనని కామెంట్
  • కట్టుబట్టలతో వచ్చేశారని వెల్లడి
ఉక్రెయిన్ పై యుద్ధం సామాన్యులకే కాదు.. సెలబ్రిటీలకూ కష్టాలను తెచ్చిపెట్టింది. ఉక్రెయిన్ ను వీడి లక్షలాది మంది దేశ సరిహద్దులను దాటి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్టార్ హీరో, డైరెక్టర్ శాన్ పెన్ కు కూడా ఆ బాధలు తప్పలేదు. రష్యా యుద్ధం మొదలైన తర్వాత గత గురువారం ఉక్రెయిన్ కు వెళ్లి జెలెన్ స్కీతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న శాన్.. ఇప్పుడు ఉక్రెయిన్ కు చెందిన లక్షలాది మంది లాగానే పోలెండ్ కు వలస కట్టాడు. 

కాలినడకన ఉక్రెయిన్ యుద్ధ భూమి నుంచి తప్పించుకున్నాడు. బ్యాక్ ప్యాక్, స్ట్రాలర్ సూట్ కేసును తీసుకుని నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని అతడు ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ, ఫొటోను పోస్ట్ చేశాడు. 

‘‘ఇద్దరు సహచరులతో కలిసి నేను చాలా దూరం నడిచి పోలెండ్ సరిహద్దులకు చేరుకున్నాను. మా కారును రోడ్డు పక్కనే వదిలేసి వచ్చేశాం. రోడ్డు మీద క్యూ కట్టిన కార్లన్నీ పిల్లలు, ఆడవాళ్లతోనే ఉన్నాయి. మగవాళ్లు లేరు. ఏ ఆస్తులూ లేవు. కట్టుబట్టలతోనే వారు దేశాన్ని వీడారు. వారికున్న ఆస్తి ఏదైనా ఉందంటే అది ఒక్క ఆ కారే’’ అంటూ శాన్ ట్వీట్ చేశాడు.    

కాగా, ఉక్రెయిన్ నుంచి శాన్ పెన్ క్షేమంగా బయటపడ్డాడని లాస్ ఏంజిలిస్ లోని శాన్ ప్రతినిధి మారా బక్స్ బామ్ చెప్పారు. అయితే, అతడు ఎక్కడున్నాడన్న విషయాన్ని మాత్రం ఆమె చెప్పలేదు. గత నవంబర్ లో ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా ఆ దేశ రాజకీయ ప్రతినిధులు, సైనికాధికారులను శాన్ ఇంటర్వ్యూ చేసినట్టు తెలుస్తోంది. 

‘ఇంటూ ద వైల్డ్’, ‘ద క్రాసింగ్ గార్డ్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను శాన్ పెన్ డైరెక్ట్ చేశాడు.


More Telugu News