హమ్మయ్య... ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి భారతీయులందరూ సురక్షితంగా బయటపడ్డారు!

  • గత 24 గంటల్లో ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకున్న 1,377 మంది
  • రానున్న మూడు రోజుల్లో 26 విమానాలను ఆపరేట్ చేయనున్న భారత్
  • ఇప్పటి వరకు స్వదేశానికి చేరుకున్న వారి సంఖ్య దాదాపు 9 వేలు
ఉక్రెయిన్ పై రష్యా చేసిన దండయాత్ర రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. అంతర్జాతీయ సమాజం నుంచి ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఏమాత్రం పట్టించుకోని రష్యా అధినేత పుతిన్.. రోజురోజుకూ అదనంగా తమ బలగాలను ఉక్రెయిన్ లోకి పంపుతూనే ఉన్నారు. 

ఈ క్రమంలో ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు నగరాలను నాశనం చేసిన రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా భీకర పోరు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైనికులపైనే కాకుండా, పౌరులపై కూడా రష్యన్ సైనికులు కాల్పులకు తెగబడుతున్నారు. కీవ్ పై రష్యన్ బలగాలు పోరాటాన్ని ఉద్ధృతం చేసిన నేపథ్యంలో భారత్ కీలక ప్రకటన చేసింది. 

గత 24 గంటల్లో ఉక్రెయిన్ నుంచి 1,377 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చామని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటించారు. ఆరు విమానాలు గత 24 గంటల్లో ఇండియాకు వచ్చాయని... ఇందులో పోలండ్ భూభాగం నుంచి వచ్చిన తొలి విమానం కూడా ఉందని చెప్పారు. 

ఉక్రెయిన్ లో చిక్కుకున్న మన వాళ్లను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ ద్వారానే అక్కడ చిక్కుకున్న మన వారిని వెనక్కి తీసుకొస్తున్నారు. రానున్న మూడు రోజుల్లో 26 విమానాలను ఆపరేట్ చేయబోతున్నారు. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో, ఆ దేశంలో చిక్కుకున్న వారిని సరిహద్దు దేశాలైన పోలండ్, హంగరీ, రొమేనియా, స్లొవాక్ రిపబ్లిక్ దేశాల్లోని ఎయిర్ పోర్టుల నుంచి తీసుకొస్తున్నారు. భారత వాయుసేనకు చెందిన భారీ విమానం సీ-17 ఈ తెల్లవారుజామున రొమేనియాకు తరలివెళ్లింది. 

మరోవైపు ఉక్రెయిన్ క్యాపిటల్ సిటీ కీవ్ లో భారతీయులెవరూ లేరని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్ వర్ధన్ తెలిపారు. కీవ్ లో ఉన్న మనవాళ్లు అందరూ సురక్షితంగా నగరాన్ని వీడారని చెప్పారు. దాదాపు 16 వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్ లో చదువుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 9 వేల మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు.


More Telugu News