ఖార్కివ్‌లో ల్యాండైన రష్యా పారాట్రూపర్లు.. స్థానిక ఆసుపత్రిపై దాడి

  • ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమై నేటికి వారం 
  • ఖార్కివ్‌లో ఆసుపత్రి వద్ద రాత్రి నుంచి భీకర యుద్ధం
  • భారతీయుల కోసం అత్యవసర సలహాలు జారీ చేసిన పోలండ్‌లోని భారత రాయబార కార్యాలయం
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి నేటికి వారం రోజులు అయింది. కీవ్ సహా ఇతర పెద్ద నగరాల్లో పోరు రోజురోజుకి తీవ్రతరం అవుతోంది. రాజధాని కీవ్‌లోని లక్ష్యాలను ఛేదించేందుకు రష్యా సేనలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇదే విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ కూడా తెలిపింది. మరోవైపు, ఖార్కివ్‌లో జరిగిన షెల్లింగ్‌లో భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.  

రష్యా వైమానిక దళానికి చెందిన పారాట్రూపర్లు తూర్పు ఉక్రెయిన్ నగరమైన ఖార్కివ్‌లో ల్యాండయ్యాయి. స్థానిక ఆసుపత్రిపై దాడికి దిగాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ సైన్యం కూడా నిర్ధారించింది. రష్యా వైమానిక దళాలు ఖార్కివ్‌లో దిగాయని, స్థానిక ఆసుపత్రిపై దాడి ప్రారంభించాయని పేర్కొంది. రాత్రి నుంచి ఇక్కడ భీకర యుద్ధం జరుగుతోందని సైన్యం పేర్కొంది. 

కాగా, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం పోలండ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అత్యవసర సలహాలు జారీ చేసింది. షెహినీ-మోడికా సరిహద్దు వైపుగా వెళ్లొద్దని కోరింది. పోలండ్‌లోకి రావాలనుకునేవారు బుడోమియర్జ్ సరిహద్దుకు చేరుకోవాలంటూ అత్యవసర సలహాలు జారీ చేసింది.


More Telugu News