ఉక్రెయిన్‌లోని భార‌తీయుల కోసం రంగంలోకి దిగుతున్న సీ-17 విమానాలు

  • విడ‌త‌ల వారిగా ప్ర‌ధాని మోదీ స‌మీక్ష‌లు
  • వాయుసేన రంగంలోకి దిగేలా ఆదేశాలు
  • భార‌తీయుల త‌ర‌లింపు కోసం ఉక్రెయిన్‌, ర‌ష్యాల‌తో విదేశాంగ శాఖ చ‌ర్చ‌లు
ర‌ష్యాతో యుద్ధం కార‌ణంగా భీతావ‌హ ప‌రిస్థితులు నెల‌కొన్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌తీయుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించే విష‌యంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్ప‌టికే ద‌ఫ‌ద‌ఫాలుగా విదేశాంగ శాఖ మంత్రి, ఆ శాఖ అధికారుల‌తో భేటీలు నిర్వ‌హించిన మోదీ.. మంగ‌ళవారం సాయంత్రం కూడా మ‌రో ద‌ఫా బేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా మోదీ భార‌త ర‌క్ష‌ణ శాఖ‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకువ‌చ్చేందుకు వాయు సేన‌ను రంగంలోకి దించాల‌ని ప్ర‌ధాని ఆదేశించారు. వాయుసేన‌కు చెందిన సీ-17 విమానాల ద్వారా త్వ‌రితగ‌తిన ఉక్రెయిన్‌లోని భార‌తీయుల‌ను దేశానికి త‌ర‌లించాల‌ని ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదేశాల‌తో ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ వెంట‌నే రంగంలోకి దిగిపోయింది. విదేశాంగ శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ఉక్రెయిన్‌లోని భార‌తీయుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు సీ-17 విమానాల‌ను ఉక్రెయిన్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను అక్క‌డి నుంచి త‌ర‌లించేందుకు స‌హ‌క‌రించాల‌ని అటు ఉక్రెయిన్‌తో పాటు ఇటు ర‌ష్యాను కోరాల‌ని విదేశాంగ శాఖ‌కు మోదీ ఆదేశాలు జారీ చేశారు. మోదీ ఆదేశాల‌కు అనుగుణంగా ఇప్ప‌టికే ఆ రెండు దేశాలతో విదేశాంగ శాఖ చ‌ర్చ‌లు మొద‌లుపెట్టింది. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్‌లోని భార‌తీయుల కోసం సీ-17 విమానాలు ఏ క్ష‌ణంలో అయినా టేకాఫ్ తీసుకునేందుకు రంగం సిద్ధ‌మైపోయింది.


More Telugu News