కిరణ్ అబ్బవరంకు, నాకు ఓ కామన్ లింకు ఉంది... అది పవర్ స్టార్!: దర్శకుడు వేణు శ్రీరామ్

  • కిరణ్ అబ్బవరం హీరోగా సెబాస్టియన్ పీసీ 524
  • నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్
  • హాజరైన దర్శకులు వేణు శ్రీరామ్, వెంకీ కుడుముల
  • కిరణ్ అబ్బవరంపై ప్రశంసలు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్ పీసీ 524 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెబాస్టియన్ చిత్రబృందంతో పాటు టాలీవుడ్ దర్శకులు వేణు శ్రీరామ్, వెంకీ కుడుముల, సీనియర్ నటుడు సాయికుమార్ తదితరులు హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ, సెబాస్టియన్ చిత్ర హీరో కిరణ్ కు తనకు ఓ కామన్ లింకు ఉందని, అది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని వెల్లడించారు. 

"వకీల్ సాబ్ సినిమా అయిపోయాక కిరణ్ ఓసారి నన్ను కలిశాడు. సార్... నేను కూడా పవన్ కల్యాణ్ ఫ్యాన్ ని అని చెప్పాడు. నువ్వు కూడా కాదయ్యా... మనం అందరిమీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పాను. ఆ విధంగా కిరణ్ తో ఓ బంధం ఏర్పడింది. రాజాగారు రాణిగారు అనే చిత్రం ద్వారా ఓ హీరో ఇండస్ట్రీకి వచ్చాడని కిరణ్ నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఎస్.ఆర్.కల్యాణమండపం చిత్రం ద్వారా బాక్సాఫీసు వద్ద కూడా ఆకట్టుకున్నాడు. 

ఎస్.ఆర్.కల్యాణమండపం చిన్న సినిమానే అయినా సంక్షోభ సమయంలో ఎగ్జిబిటర్లకు ఊపిరి పోసింది. ఇప్పుడు సెబాస్టియన్ తో హ్యాట్రిక్ ముంగిట నిలిచాడు. ఆల్రెడీ 9 చిత్రాలు చేస్తున్నాడు. రెండు మూడు చిత్రాలు షూటింగ్ కూడా పూర్తిచేసుకున్నాయి. సెబాస్టియన్ కంటెంట్ పై ఉన్న నమ్మకంతో భీమ్లా నాయక్, రాధేశ్యామ్ ల మధ్య తన చిత్రాన్ని వదులుతున్నాడు" అంటూ కిరణ్ అబ్బవరంపై ప్రశంసలు కురిపించాడు. 

అంతకుముందు, దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ, ఈ చిత్రం ట్రైలర్ తనకు బాగా నచ్చిందని తెలిపారు. ఎస్.ఆర్.కల్యాణమండపం చిత్రం సమయంలోనే అతడి నటన తనను బాగా ఆకట్టుకుందని వెల్లడించారు. 

"కిరణ్ కు, నాకు ఎక్కడో చిన్న కనెక్షన్ ఉందన్న ఫీలింగ్ ఉంది. ఇంటి పేర్లు నిలబెట్టేందుకు కృషి చేస్తున్నవారిలో మేమిద్దరం కూడా ఉన్నామని అనిపిస్తుంటుంది. కుడుముల అనేది మా ఇంటి పేరు... అందుకే జిమ్ కు వెళ్లకుండానే ఫిజిక్ తగ్గకుండా నేను మెయింటైన్ చేస్తున్నాను... కిరణ్ కూడా తన ఇంటి పేరు అబ్బవరంలాగా అబ్బా అనిపించేలా నటిస్తున్నాడు. అంతేకాదు తను చేసే కాన్సెప్టులన్నింటికీ ఓ వరంలా దొరికాడు అనిపించుకునేలా చేస్తున్నాడు" అంటూ వెంకీ కుడుముల చమత్కరించారు. కిరణ్ మంచి నటుడు, అతడికి తప్పకుండా మంచి భవిష్యత్తు ఉందని నమ్ముతున్నానని అన్నారు. 


More Telugu News