100వ టెస్టు ఆడబోతున్న విరాట్ కోహ్లీ... గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • మార్చి 4 నుంచి భారత్, శ్రీలంక టెస్టు సిరీస్
  • మొహాలీలో తొలి టెస్టు
  • 100వ టెస్టు మ్యాచ్ ముంగిట కోహ్లీ
  • సెంచరీతో చిరస్మరణీయం చేసుకోవాలన్న గవాస్కర్
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్ లో అరుదైన మైలురాయి ముంగిట నిలిచాడు. శ్రీలంకతో ఈ నెల 4 నుంచి మొహాలీలో జరిగే మ్యాచ్ కోహ్లీ ఖాతాలో 100వ టెస్టు అవుతుంది. తద్వారా భారత్ తరఫున 100, అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడిన వారి జాబితాలో కోహ్లీ కూడా చేరనున్నాడు. ఇప్పటివరకు 11 మంది భారత ఆటగాళ్లు ఈ ఘనత అందుకున్నారు. 

ఇక, భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన మొదటి ఆటగాడు సునీల్ గవాస్కర్. ఇప్పుడు కోహ్లీ కూడా ఈ క్లబ్ లో చేరనున్న నేపథ్యంలో, గవాస్కర్ స్పందించారు. మొహాలీ మైదానంలో 100వ టెస్టు ఆడబోతున్న కోహ్లీ, ఆ మ్యాచ్ లో సెంచరీ చేసి సంబరాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. చిరస్మరణీయ మ్యాచ్ లో శతకం సాధించడం అద్భుతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకున్న ఆటగాళ్లకు తెల్లదుస్తులు ధరించి టెస్టు మ్యాచ్ ఆడాలనుకోవడం ఓ కల అయితే, ముఖ్యంగా దేశం తరఫున 100 టెస్టులు ఆడడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని గవాస్కర్ పేర్కొన్నారు. 

కాగా, ఇప్పటివరకు ఏ భారత ఆటగాడు కూడా తన 100వ టెస్టులో సెంచరీ చేయలేదు. ఈ అంశాన్ని కూడా గవాస్కర్ ప్రస్తావించారు. తన 100వ టెస్టులో 48 పరుగులకు అవుటైన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. 

తనకు తెలిసినంతవరకు విదేశీ ఆటగాళ్లలో కొలిన్ కౌడ్రే 100వ టెస్టులో 100 పరుగులు చేసిన తొలి ఆటగాడని, టెస్టు చరిత్రలో 100 టెస్టులు ఆడిన తొలి ఆటగాడు కూడా ఆయనేనని తెలిపారు. ఆ తర్వాత జావెద్ మియాందాద్ (పాకిస్థాన్), అలెక్ స్టివార్ట్ (ఇంగ్లండ్) కూడా 100వ టెస్టులో సెంచరీ నమోదు చేశారని గవాస్కర్ వివరించారు. భారత్ తరఫున కోహ్లీ ఆ ఘనత అందుకుంటాడని ఆశిస్తున్నట్టు తెలిపారు. 

కోహ్లీ టెస్టు కెరీర్ లో ఇప్పటిదాకా 99 టెస్టులు ఆడి 7962 పరుగులు సాధించాడు. కోహ్లీ సగటు 50.39 కాగా, అత్యధిక స్కోరు 254 నాటౌట్. ఈ ఐదు రోజుల ఫార్మాట్లో కోహ్లీ 27 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు నమోదు చేశాడు.

భారత్ తరఫున ఇప్పటివరకు 100 టెస్టులు ఆడింది వీరే...

  • సచిన్ టెండూల్కర్ (200 టెస్టులు)
  • రాహుల్ ద్రావిడ్ (163)
  • వీవీఎస్ లక్ష్మణ్ (134)
  • అనిల్ కుంబ్లే (132)
  • కపిల్ దేవ్ (131)
  • సునీల్ గవాస్కర్ (125)
  • దిలీప్ వెంగ్ సర్కార్ (116)
  • సౌరవ్ గంగూలీ (113)
  • ఇషాంత్ శర్మ (105)
  • హర్భజన్ సింగ్ (103)
  • వీరేంద్ర సెహ్వాగ్ (103)



More Telugu News