ఇంటి బాట ప‌ట్టి.. అంత‌లోనే ర‌ష్యా కాల్పుల్లో మృతి చెందిన వైద్య విద్యార్థి నవీన్

  • ఖ‌ర్కీవ్ నుంచి స‌రిహ‌ద్దుకు న‌వీన్ ప‌య‌నం
  • అదే స‌మ‌యంలో న‌గ‌రంపై ర‌ష్యా మూకుమ్మ‌డి దాడి
  • ర‌ష్యా సైనికుల కాల్పుల్లో న‌వీన్ మృతి
నిజ‌మే.. కొద్దిసేపు ర‌ష్యా బ‌ల‌గాలు ఆగి ఉన్నా..అక్క‌డికి ర‌ష్యా బ‌ల‌గాలు కాస్తంత ఆల‌స్యంగా చేరుకున్నా ఉక్రెయిన్‌లో వైద్య విద్య అభ్య‌సిస్తున్న క‌ర్ణాట‌క విద్యార్థి న‌వీన్ ప్రాణాల‌తో సొంత దేశం చేరేవాడే. అయితే విధి క‌నిక‌రించ‌లేదు. 

యుద్ధం నేప‌థ్యంలో ప్రాణాలు అర‌చేత ప‌ట్టుకుని సొంత దేశాల‌కు త‌ర‌లివెళ్లేందుకు ఉక్రెయిన్‌లోని విదేశీయులు నానా పాట్లు ప‌డుతున్నారు. ఏదోలా చాలా మంది ఉక్రెయిన్ స‌రిహ‌ద్దులు చేరుకుంటున్నారు. ఆ దేశాన్ని వ‌దిలేసి పొరుగు దేశాల్లో కాలు మోపుతున్నారు. ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఈ మాదిరిగానే 1,500 మందిదాకా భార‌తీయులు ఉక్రెయిన్ స‌రిహ‌ద్దు చేరుకుని అక్క‌డి మ‌న విదేశాంగ శాఖ అధికారుల సాయంతో విమానం ఎక్కేసి సొంత దేశం వ‌చ్చేశారు. 

న‌వీన్ కూడా వారి మాదిరే ఖర్కీవ్ నుంచి ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల‌కు చేరేందుకు య‌త్నించాడు. ఖ‌ర్కీవ్‌లో తాను ఉంటున్న స్థానంనుంచి అత‌డు చాలా దూర‌మే వ‌చ్చిన‌ట్టుగా స‌మాచారం. అయితే ఆ లోగానే ఖ‌ర్కీవ్‌పై ర‌ష్యా బ‌ల‌గాలు మూకుమ్మ‌డిగా దాడికి దిగాయి. 

ఓ వైపు బాంబులేస్తూ ర‌ష్యా యుద్ధ ట్యాంకులు సాగితే.. అత్యాధునిక తుపాకులు చేత‌బ‌ట్టిన ర‌ష్యా సైనికులు క‌నిపించిన జ‌నంపై కాల్పులు కురిపించారు. ఈ కాల్పుల్లోనే న‌వీన్ మృతి చెందాడు. ర‌ష్యా సేన‌లు అక్క‌డికి చేరుకోవ‌డానికి కాస్తంత ఆల‌స్య‌మైనా.. లేదంటే ఇంకాస్త ముందుగా న‌వీన్ బ‌య‌లుదేరి వున్నా ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డేవాడు. మాతృదేశం చేరి త‌న కోసం తీవ్ర ఆందోళ‌న చెందుతున్న త‌ల్లిదండ్రుల చెంత‌కూ చేరేవాడు.


More Telugu News