మా జీవితాలనే మార్చేసింది.. ‘హిట్ రిఫ్రెష్’ పుస్తకంలో కుమారుడు జైన్ జననంపై సత్య నాదెళ్ల

  • 36వ వారంలో గర్భంలో ఆగిన కదలికలు
  • పుట్టాక ఉలుకూపలుకూ లేదు
  • కిలోన్నర బరువుతోనే జననం
  • సెరిబ్రల్ పాల్సీ అని తెలిసి షాకయ్యామని వెల్లడి
కుమారుడు జైన్ నాదెళ్ల మరణంతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల విషాదంలో మునిగిపోయారు. చాలా కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే, జైన్ జన్మించినప్పుడు తన కుటుంబానికి ఎదురైన అనుభవాలు, ఆ సమయంలో ఎదుర్కొన్న కష్టాల గురించి తన జీవితంపై రాసుకున్న ఆటో బయాగ్రఫీ ‘హిట్ రిఫ్రెష్’ పుస్తకంలో వెల్లడించారు. 

జైన్ పుట్టుక తమ జీవితాలనే మార్చేసిందని పేర్కొన్నారు. ‘‘టెక్నాలజీలో మా భవిష్యత్ కు మంచి బాటలు పడుతున్న సమయం అది. ఇంజనీరింగ్ లో నేను, ఆర్కిటెక్చర్ లో అనుపమ మంచి స్థాయిలో ఉన్నాం. అప్పటికి అనూ ప్రెగ్నెంట్. మైక్రోసాఫ్ట్ క్యాంపస్ కు దగ్గర్లోనే ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాం. తొలి సంతానం కోసం ఎంతో ఆత్రుతగా చూస్తున్నాం. నర్సరీలను అలంకరిస్తూ.. డెలివరీ తర్వాత వీకెండ్ సెలవుల గురించి ఆలోచిస్తూ.. మధుర క్షణాలను తలచుకుంటూ గడిపాం. 

కానీ, ప్రెగ్నెన్సీ 36వ వారంలో ఊహించని ఘటన జరిగింది. కడుపులో బిడ్డ కదలికలు ఆగిపోయాయి. అనుపమ ఆ విషయాన్ని చెప్పిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఎమర్జెన్సీ విభాగంలో చేర్చుకున్న వైద్యులు.. సిజేరియన్ చేసి జైన్ ను బయటకు తీశారు. కేవలం కిలోన్నర మాత్రమే ఉన్న జైన్.. పుట్టాక ఉలుకూ..పలుకూ లేదు. వెంటనే సియాటిల్ లోని పిల్లల ఆసుపత్రికి జైన్ ను తీసుకెళ్లాం. 

ప్రసవం సమయంలో నేను అను దగ్గర్నే ఉన్నాను. ఆ మర్నాడు సియాటిల్ కు వెళ్లి జైన్ ను చూశాను. రెండు మూడేళ్లు గడిచాక జైన్ కు కలిగిన సమస్య తెలిసిందే. గర్భంలో ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడంలో తలెత్తిన సమస్య వల్లే జైన్ ఆరోగ్యానికి హాని జరిగిందని తెలిసింది. సెరిబ్రల్ పాల్సీగా వైద్యులు చెప్పడంతో నేను, అనుపమ షాక్ అయ్యాం. జీవితాంతం వీల్ చైర్ కు పరిమితం కావడంతో పాటు తల్లిదండ్రులపైనే ఆధారపడాల్సి వస్తుందని వైద్యులు మాకు చెప్పారు’’ అంటూ తన కుమారుడి గురించి పుస్తకంలో సత్య రాసుకొచ్చారు.


More Telugu News