నాటి కువైట్ తరలింపులకన్నా ఇది పెద్ద పనేం కాదు.. ఉక్రెయిన్ లోని ఇండియన్ల తరలింపుపై బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా

  • అక్కడున్నది కేవలం 18 వేల మందే
  • కువైట్ నుంచి 1.7 లక్షల మందిని తీసుకొచ్చాం
  • ఎన్నికల కోసం వాడుకోవడం విచారకరమన్న యశ్వంత్ 
ఆపరేషన్ గంగా మిషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా మండిపడ్డారు. ఉక్రెయిన్ లో మహా అయితే 18 వేల మంది భారతీయులే ఉన్నారని, వారిని సురక్షితంగా తరలించడం పెద్ద కష్టమైన పనేం కాదని అన్నారు. గతంలో వాజ్ పేయి హయాంలో కువైట్ నుంచి తరలింపులను ఆయన గుర్తు చేశారు. 

గల్ఫ్ యుద్ధం సమయంలో 1990 ఆగస్టు, అక్టోబర్ మధ్య కువైట్ నుంచి వాజ్ పేయి ప్రభుత్వం 1.7 లక్షల మందిని తీసుకొచ్చిందని, దానితో పోలిస్తే ఉక్రెయిన్ నుంచి 18 వేల మందిని తీసుకురావడం కష్టమేం కాదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం ఈ తరలింపులను వాడుకోవడం విచారకరమన్నారు. ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ తరలింపుల విషయాన్ని ప్రస్తావిస్తున్నారని, అది మంచి విషయం కాదని చెప్పారు. తరలించడం కేంద్ర ప్రభుత్వ విధి అన్నారు. 

ఉక్రెయిన్ లో యుద్ధ సంక్షోభం వస్తుందన్న విషయం తెలిసి కూడా ప్రభుత్వం ఆదిలోనే స్పందించకపోవడం గమనార్హమన్నారు. ఉక్రెయిన్ గగనతలం తెరిచి ఉన్నప్పుడే అందరినీ తీసుకొచ్చేలా చర్యలు చేపడితే బాగుండేదన్నారు. గగనతలం మూసేసిన వెంటనే బస్సులు, ఇతర రవాణా మార్గాల ద్వారా భారతీయులను సరిహద్దు దేశాలకు రాయబార కార్యాలయం తరలించి ఉండాల్సిందన్నారు. 

నలుగురు కేంద్ర మంత్రులను సరిహద్దు దేశాలకు కొంచెం ముందే పంపి ఉండాల్సిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని, ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్లే ఉక్రెయిన్ అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారని యశ్వంత్ సిన్హా ఆరోపించారు.


More Telugu News