రష్యాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లావాదేవీల బంద్!

  • కరెన్సీ ఏదైనా ట్రాన్సాక్షన్ చేయొద్దు
  • క్లయింట్లకు లేఖ రాసిన టాప్ బ్యాంక్
  • ఐరాస, అమెరికా, ఈయూ ఆంక్షలకు అనుగుణంగా చర్యలన్న అధికారి 
ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అన్ని లావాదేవీలను నిలుపుదల చేయనుంది. రష్యాకు చెందిన సంస్థలు, బ్యాంకులు, పోర్టులు, నౌకల వంటి వాటికి సంబంధించి ఎలాంటి లావాదేవీలను జరపరాదంటూ క్లయింట్లకు నోటీసులు పంపింది. ఇప్పటికే రష్యాపై ఐక్యరాజ్యసమితి, అమెరికా, ఐరోపా దేశాలు కఠినమైన ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే ఆ ఆంక్షలకు తగినట్టు కరెన్సీ ఏదైనా సరే రష్యాతో లావాదేవీలను జరపకూడదని క్లయింట్లకు రాసిన లేఖలో ఎస్బీఐ పేర్కొంది. ప్రస్తుతానికి ఎస్బీఐ దీనిపై నేరుగా స్పందించలేదు. అయితే, ఓ అధికారి ఆంక్షలకు గల కారణాలను వివరించారు. ‘‘మా వ్యాపారం ప్రపంచమంతటా ఉంది. అమెరికా, ఐరోపా సమాఖ్య విధించిన నిబంధనలకు అనుగుణంగా మేం ముందుకు పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రూల్స్ కు విరుద్ధంగా మేమేమీ నిర్ణయం తీసుకోలేం’’ అని ఆ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వివరించారు. 

ఇక, రష్యాతో ఉన్న లింకుల గురించి భారత చమురు సంస్థలను ఎస్బీఐ ఆరా తీసింది. రష్యాలోని ఆస్తుల్లో వాటా, గత ఏడాది రష్యా నుంచి వచ్చిన నిధులు, ఈ లావాదేవీలను నడిపిన రుణదాతలు/సంస్థల వివరాలను అడిగినట్టు సమాచారం. కాగా, రష్యా ముడి చమురు, కజక్ సీపీసీ బ్లెండ్ ను తాము ఇక తీసుకోబోమని నిన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.


More Telugu News