పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరిట ఉపగ్రహం: కన్నడ ఐటీ మంత్రి

  • పునీత్ స్మారకార్థం ఉపగ్రహ తయారీకి శ్రీకారం
  • రూ. 1.90 కోట్లతో ఒక కిలో బరువైన శాటిలైట్
  • ఉపగ్రహాన్ని రూపొందించనున్న బెంగళూరుకు చెందిన విద్యార్థులు
కన్నడ పవర్ స్టార్ గా సినీ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న పునీత్ రాజ్ కుమార్ ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణానికి సంబంధించిన విషాదం నుంచి అభిమానులు ఇంకా కోలుకోలేదు. ఆయన చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. మరోవైపు ఆయన స్మారకార్థం ఓ ఉపగ్రహాన్ని తయారు చేసేందుకు శ్రీకారం చుట్టారు. పునీత్ పేరిట శాటిలైట్ ను రూపొందించనున్నట్టు కర్ణాటక రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి అశ్వత్థనారాయణ ప్రకటించారు. 

బెంగళూరులోని ప్రముఖ పీయూ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉపగ్రహ తయారీ కోసం ప్రభుత్వం తరపున రూ. 1.90 కోట్లను ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. బెంగళూరుకు చెందిన విద్యార్థుల ద్వారానే విగ్రహాన్ని తయారు చేస్తామని చెప్పారు. సాధారణంగా 50 కిలోల శాటిలైట్ ను రూపొందించేందుకు రూ. 50 నుంచి 60 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. కిలో బరువున్న శాటిలైట్ ను విద్యార్థులు రూ. 1.90 కోట్లతో రూపొందిస్తారని తెలిపారు. 20 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ ప్రాజెక్టులో భాగస్వాములు అవుతారని చెప్పారు.


More Telugu News