డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లోనూ మందుబాబులకు ఊరట.. జరిమానాల్లో భారీ రాయితీ

  • ఈ నెల 12తో ముగియనున్న లోక్ అదాలత్
  • డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో జైలు శిక్ష లేనట్టే
  • జరిమానాలతోనే సరి
  • లోక్ అదాలత్ ముగిశాక మళ్లీ మామూలే
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారికి తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు బోల్డంత ఉపశమనం కల్పించారు. తాగి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి విధించిన జరిమానాల్లో భారీ రాయితీలు ప్రకటించారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడుతున్న వారికి ఇప్పటి వరకు జైలు శిక్షలు విధిస్తుండగా ఇకపై జరిమానాలతోనే సరిపెట్టాలని నిర్ణయించారు. ప్రత్యేక లోక్ అదాలత్‌ల ద్వారా పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ మేరకు అన్ని కమిషనరేట్ల పరిధిలోని న్యాయస్థానాల్లోనూ మార్చి 12 వరకు లోక్ అదాలత్‌లను నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు.

నిజానికి డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడి వాహనాలు వదిలేసుకున్నచాలామంది జైలు శిక్షపడుతుందేమోనన్న ఉద్దేశంతో పోలీసులను, కోర్టులను సంప్రదించడం మానేశారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారు రూ. 10 వేలకు పైగా జరిమానా చెల్లించాల్సి రావడంతో పాత వాహనాలను వదిలేసుకోవడమే మేలని భావించి అటువైపు చూడడం మానేశారు. అలాంటి వారికిది శుభవార్తే. జైలు శిక్ష లేకుండా చేయడంతోపాటు జరిమానాలను కూడా తగ్గించడంతో అలాంటి వారంతా ముందుకొస్తారని పోలీసు అధికారులు భావిస్తున్నారు. 

రాయితీల విషయంలో బైక్‌లు, కార్లు, హెవీ వెయిట్ వాహనాలకు వేర్వేరుగా జరిమానాలు విధించగా, రాయితీలు కూడా అందుకు అనుగుణంగానే ప్రకటించారు. అయితే, రాయితీ చెల్లించిన తర్వాత కూడా మరోమారు పట్టుబడితే మాత్రం జరిమానాను రెండింతలు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాయితీలతో కూడిన లోక్ అదాలత్ ఇప్పటికే ప్రారంభం కాగా, ఈ నెల 12న ముగుస్తుందని, ఆలోగా పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకోవాలని కోరుతున్నారు. అయితే, గడువు ముగిసిన తర్వాత మాత్రం పాత జరిమానాలే కొనసాగుతాయని తెలిపారు.


More Telugu News