బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు అరెస్ట్‌

  • క‌ర్మ‌న్ ఘాట్‌లో ఇటీవ‌లే ఇరు వ‌ర్గాల ఘ‌ర్ష‌ణ‌
  • అక్క‌డికి వెళుతున్నార‌న్న స‌మాచారంతోనే ర‌ఘునంద‌న్ రావు అరెస్ట్‌
  • ఘ‌ట్ కేస‌ర్ పీఎస్‌కు త‌ర‌లింపు
  • అరెస్ట్‌ను ఖండించిన బీజేపీ రాష్ట్ర శాఖ‌
బీజేపీ నేత‌, సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైద‌రాబాద్‌లో ఇటీవ‌లే ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల‌తో తీవ్ర ఉద్రిక్త‌తలు నెల‌కొన్న క‌ర్మన్ ఘాట్‌కు వెళుతున్నార‌న్న స‌మాచారంతో ర‌ఘునంద‌న్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీ న‌గ‌ర్‌లో అదుపులోకి తీసుకున్న ఆయ‌న‌ను ఘ‌ట్‌కేస‌ర్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. 

ఇటీవ‌లే క‌ర్మ‌న్ ఘాట్‌లో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఫ‌లితంగా అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో ఘర్షణకు దిగిన ఓ వర్గానికి మద్దతుగా క‌ర్మ‌న్ ఘాట్‌కు ర‌ఘునంద‌న్ రావు వెళుతున్నార‌న్న స‌మాచారం పోలీసులకు అందింది. దీంతో వెనువెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు ఎల్బీ న‌గ‌ర్ లోనే ర‌ఘునంద‌న్ రావును అదుపులోకి తీసుకున్నారు.

 ఇదిలా ఉంటే.. ర‌ఘునంద‌న్ రావు అరెస్ట్‌ను బీజేపీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండించింది. బీజేపీ నేత‌ల‌పై టీఆర్ఎస్ స‌ర్కారు క‌క్షపూరితంగా అక్ర‌మ కేసులు పెట్ట‌డంతో పాటు ఏకంగా అరెస్టులు చేస్తోంద‌ని ఆ శాఖ ఆరోపించింది.


More Telugu News