కేసు విచార‌ణ‌లో ఉండ‌గా ఆర్డినెన్సా?: ఏపీ స‌ర్కారుపై హైకోర్టు ఆగ్ర‌హం

  • 54 మందిని ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మించిన ఏపీ స‌ర్కారు
  • వారిలో చాలా మందికి నేర చ‌రిత‌ ఉందంటూ ఆరోపణలు 
  • నేర చరిత క‌లిగిన వారి నియామ‌కంపై హైకోర్టులో పిటిష‌న్లు
  • కోర్టు ఆగ్ర‌హంతో ఇక‌పై ముందుకెళ్ల‌బోమన్న ఏపీ స‌ర్కారు
ఏదేనీ విష‌యంపై కోర్టులో విచార‌ణ జ‌రుగుతుండ‌గా.. దానిపైనే ఆర్డినెన్స్ ఎలా జారీ చేస్తార‌ని ఏపీ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇలా చేసిన ఏపీ స‌ర్కారుపై హైకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసింది. హైకోర్టు ఆగ్ర‌హంతో ప్ర‌భుత్వ న్యాయ‌వాది.. దానిపై ఇక‌పై ఎలాంటి ముంద‌డుగు వేయ‌బోమ‌ని స‌ర్ది చెప్పాల్సి వ‌చ్చింది.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ)లో ఇటీవ‌లే ఏపీ ప్ర‌భుత్వం 54 మందిని ప్ర‌త్యేక ఆహ్వానితులుగా నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ 54 మందిలో చాలామందికి నేర‌చ‌రిత్ర ఉందంటూ టీటీడీ బోర్డు మాజీ స‌భ్యుడు, బీజేపీ నేత భానుప్ర‌కాశ్ రెడ్డితో పాటు మ‌రో వ్య‌క్తి హైకోర్టును ఆశ్ర‌యించారు. వీరి పిటిష‌న్ల‌ను హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించ‌గా.. మరోపక్క ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానితుల‌పై ఆర్డినెన్స్ జారీ చేసింది.

ఈ వ్య‌వ‌హారంపై కోర్టులో విచార‌ణ జ‌రుగుతుండ‌గా.. ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ ఎలా జారీ చేస్తుందంటూ పిటిష‌నర్లు మ‌రోమారు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై నేడు విచార‌ణ జ‌ర‌గ్గా... ప్ర‌భుత్వ తీరును హైకోర్టు త‌ప్పుబ‌ట్టింది. దీంతో ప్ర‌త్యేక ఆహ్వానితుల విష‌యంలో ఇక ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోమ‌ని ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు తెలిపారు. దీంతో శాంతించిన కోర్టు విచార‌ణ‌ను మార్చి 11కు వాయిదా వేసింది. అదే రోజున ప్ర‌త్యేక ఆహ్వానితుల విష‌యంపై తుది విచార‌ణ జ‌రిగే అవ‌కాశాలున్నాయి.


More Telugu News