ఉక్రెయిన్ - రష్యా యుద్ధ ప్రభావం.. చేదెక్కనున్న బీర్ ధర..!

  • ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన బార్లీ ధరలు
  • బార్లీ తయారీలో రష్యా రెండో అతిపెద్ద దేశం
  • మాల్ట్ తయారీలో ఉక్రెయిన్ నాలుగో స్థానం
  • ధరల పెరుగుదలతో పెరగనున్న తయారీ వ్యయం
ఉక్రెయిన్ -  రష్యా సంక్షోభం ప్రభావం మన దేశంలోని బీరు ప్రియులనూ తాకనుంది. ఎందుకంటే బీరు తయారీలోకి వినియోగించే ప్రధాన ముడి పదార్థం బార్లీ ధరలు భారీగా పెరగనున్నాయి.

బార్లీ ఉత్పత్తిలో రష్యా రెండో అతిపెద్ద దేశంగా ఉంది. బీర్ తయారీకి మరొక ముడి పదార్థం మాల్ట్ ఉత్పత్తిలో ఉక్రెయిన్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశం. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ముగింపు పడకుండా ఇలానే మరికొంత కాలం కొనసాగితే అప్పుడు బార్లీకి కొరత ఏర్పడుతుంది. అది ధరల పెరుగుదలకు తారితీయవచ్చు. 

ఇక మనదేశంలోనూ బార్లీ పండుతుంది. చాలా వరకు బ్రూవరీ కంపెనీలు దేశీయ బార్లీతోనే బీర్లను తయారు చేస్తున్నాయి. కానీ, అంతర్జాతీయ మార్కెట్లో బార్లీ ధరలు అమాంతం పెరిగిపోతే, దేశీ మార్కెట్లో తక్కువకు ఎవరు విక్రయిస్తారు? అప్పుడు దేశీ ధరలు కూడా పెరిగిపోతాయి. దాంతో బీర్ల తయారీ కంపెనీలకు తయారీ వ్యయాలు అధికమవుతాయి. అంతిమంగా బీరును లొట్టలేసుకుంటూ తాగే వారే ఈ భారాన్ని భరించాల్సి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

‘‘రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం అంతర్జాతీయంగా బార్లీ ధరలను ప్రభావితం చేస్తాయి. అవి ఇప్పటికే ఎగిశాయి. ఈ పరిస్థితి స్వల్పకాలం నుంచి మధ్య కాలం వరకు ఉండొచ్చు. ఆల్కహాల్ ధరలను నిర్ణయించడంలో రాష్ట్రాలదే ముఖ్య పాత్ర’’ అని ప్రముఖ బీర్ తయారీ కంపెనీ ‘బీరా 91’ సీఈవో అంకుర్ జైన్ తెలిపారు.


More Telugu News