ఉక్రెయిన్ స‌రిహ‌ద్దు దేశాల‌కు వెళుతున్న నలుగురు కేంద్ర మంత్రులు

  • ఉక్రెయిన్ నుంచి భార‌తీయ విద్యార్థుల త‌ర‌లింపు ప్ర‌క్రియ వేగ‌వంతం
  • యుద్ధ వాతావరణంలో భయంగా గడుపుతోన్న విద్యార్థులు
  • మోదీ అత్యున్న‌త స‌మావేశం
ఉక్రెయిన్ నుంచి భార‌తీయ విద్యార్థుల త‌ర‌లింపు ప్ర‌క్రియ వేగ‌వంతం అవుతోంది. యుద్ధ వాతావరణంలో భయంగా గడుపుతోన్న విద్యార్థుల‌ను స్వ‌దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకోనుంది. ఆప‌రేష‌న్ గంగను వేగ‌వంతం చేయ‌డానికి ప్ర‌ధాని మోదీ అత్యున్న‌త స‌మావేశం ఏర్పాటు చేశారు. 

న‌లుగురు కేంద్ర మంత్రుల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఉక్రెయిన్ స‌రిహ‌ద్దు దేశాల‌కు ఆ న‌లుగురు వెళ్లి, భార‌తీయుల త‌ర‌లింపు ప్ర‌క్రియ‌ను స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించ‌నున్నారు. హ‌ర్దీప్ సింగ్ పూరీ, జ్యోతిరాదిత్య సింధియా, కిర‌ణ్ రిజుజు, వీకే సింగ్ ఉక్రెయిన్ స‌రిహ‌ద్దు దేశాల‌కు వెళ్ల‌నున్నారు. 

ఉక్రెయిన్‌లో దాదాపు 16,000 మంది విద్యార్థులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. వారందరినీ తీసుకురావ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. దాదాపు 30 ఏళ్ల క్రితం కువైట్ పై ఇరాక్‌ దాడికి పాల్పడిన స‌మ‌యంలో కువైట్ ‌లో చిక్కుకున్న‌ 1.70 లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అప్ప‌ట్లో కేంద్ర ప్ర‌భుత్వం భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు అటువంటి భారీ ఆప‌రేష‌న్ కు ఉపక్రమిస్తోంది.  

ఉక్రెయిన్‌లో సుమారు 20 వేల మంది భారతీయులు ఉండ‌గా, వారిలో ఇప్ప‌టికే 4 వేల మంది భారత్‌కు తిరిగి వచ్చారు. మిగిలిన వారిని స్వ‌దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. మొద‌ట రోడ్డు మార్గంలో ఉక్రెయిన్‌ పొరుగు దేశాల‌యిన‌ హంగేరి, పోలాండ్‌, స్లొవేకియా, రొమానియాలకు భార‌తీయుల‌ను తరలిస్తోంది. ఆయా దేశాల్లో కేంద్ర మంత్రులు, అధికారులు ఉంటారు.  

అక్కడి నుంచి ప్ర‌త్యేక‌ విమానాల్లో భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకురావాలని భార‌త్‌ ప్రణాళిక వేసుకుంది. ఉక్రెయిన్ స‌రిహ‌ద్దు దేశాల‌కు భార‌తీయుల‌ను బ‌స్సుల్లో, ఇత‌ర వాహ‌నాల్లో త‌ర‌లిస్తున్నారు. కొంద‌రు విద్యార్థులు కాలిన‌డ‌క‌న వెళ్లే సాహ‌స‌మూ చేస్తున్నారు. ఇప్ప‌టికే కొంద‌రు విద్యార్థుల వ‌ద్ద డ‌బ్బు అయిపోవ‌డంతో స‌రైన ఆహారం అంద‌ట్లేదు.


More Telugu News