ఆ 13 మంది చనిపోలేదట... ఉక్రెయిన్ యుద్ధంలో ఆసక్తికర పరిణామం!

  • ఉక్రెయిన్ పై రష్యా దాడి
  • స్నేక్ ఐలాండ్ వద్ద ప్రతిఘటించిన ఉక్రెయిన్ సైనికులు
  • 13 మంది చనిపోయినట్టు వార్తలు
  • హీరోలుగా అభివర్ణించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
  • బతికే ఉన్నారని ఫొటోలు విడుదల చేసిన రష్యా
ఇటీవల రష్యా బలగాలు ఉక్రెయిన్ కు చెందిన స్నేక్ ఐలాండ్ పై దాడి చేయగా, అక్కడ విధుల్లో ఉన్న 13 మంది ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవడానికి నిరాకరించారని, చివరికి వీరమరణం పొందారని వార్తలు రావడం తెలిసిందే. వారిని జాతీయ హీరోలుగా గుర్తించి, అత్యున్నత పురస్కారాలు ప్రదానం చేస్తామని ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ వెల్లడించారు. అయితే, ఆ 13 మంది సజీవంగా ఉన్నారంటూ ఫొటోలు విడుదల కావడం సంచలనం సృష్టించింది. ఈ ఫొటోలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 

వారందరూ ఓ బస్సులో కూర్చుని ఉండడం, మంచినీరు, ఆహారం అందుకుంటున్నట్టు ఆ ఫొటోల్లో చూడొచ్చు. వారందరూ యుద్ధంలో చనిపోలేదని, తాము బందీలుగా పట్టుకున్నామని రష్యా చెబుతోంది. వారు స్వచ్ఛందంగానే లొంగిపోయారని రష్యా రక్షణ శాఖ తెలిపింది. 

అంతేకాదు, యుద్ధ ఖైదీలుగా పట్టుకున్న ఆ సైనికులను తాము విడిచిపెడుతున్నామని, వారి కుటుంబాలను కలుసుకునేందుకు వీలుగా వారిని విడుదల చేస్తున్నామని వెల్లడించింది. అయితే, రష్యా ప్రకటన విశ్వసనీయతపై సందేహాలు తలెత్తుతున్నాయి. పుతిన్ ఎత్తుగడలపై అవగాహన ఉన్నవారు రష్యా రక్షణ శాఖ ప్రకటనను నమ్మలేమని అభిప్రాయపడుతున్నారు.


More Telugu News