చమురు ధరల కట్టడికి కేంద్రం చెక్!.. అవసరమైతే వ్యూహాత్మక నిల్వల విడుదల

  • ఇంధన మార్కెట్ తీరును గమనిస్తున్నాం
  • నిల్వలు తీసేందుకు సిద్ధం
  • ధరలకు కళ్లెం వేసేందుకు కట్టుబడి ఉన్నాం
  • పెట్రోలియం శాఖ ప్రకటన
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగిపోవడంతో కేంద్ర సర్కారు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ధరల కట్టడికి వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి కొంత భాగాన్ని బయటకు విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగిన తర్వాత బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105 డాలర్లకు పెరిగిపోవడం తెలిసిందే. కొంత చల్లబడినా, ఇప్పటికీ 97 డాలర్ల వద్ద ఉంది.

మన దేశ ముడి చమురు, గ్యాస్ అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో ధరల పెరుగుదల ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. పెట్రోలియం శాఖ స్పందిస్తూ.. అంతర్జాతీయ ఇంధన మార్కెట్ లో నెలకొన్న పరిస్థితులు, చమురు సరఫరాలను క్షుణంగా గమనిస్తున్నామంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. 

‘‘వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ (ఎస్పీఆర్)లను విడుదల చేయడం ద్వారా మార్కెట్లో అస్థిరతలను తగ్గించేందుకు, ముడి చమురు ధరల పెరుగుదలను అడ్డుకునేందుకు భారత్ కట్టుబడి ఉంది’’అని పెట్రోలియం శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అయితే ఎప్పుడు, ఎంత మొత్తం విడుదల చేయనున్నదీ వివరాలు ప్రకటించలేదు.

భారత్ వద్ద 5.33 మిలియన్ టన్నుల (39 మిలియన్ బ్యారెళ్లు) వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయి. ఇవి 9.5 రోజుల అవసరాలకు సరిపోతాయి. నిజానికి పెద్ద మొత్తంలో ఈ నిల్వలను బయటకు తీస్తే తప్ప ధరల అస్థిరతకు కళ్లెం వేయడం కుదరదు. యుద్ధాలు, అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో వినియోగానికి వీలుగా భారత్ ఈ వ్యూహాత్మక చమురు నిల్వలను కొనసాగిస్తోంది. ముడి చమురు ధరలు తక్కువగా ఉన్న సమయాల్లో అధికంగా కొనుగోలు చేసి నిల్వ చేస్తుంటుంది. విశాఖపట్నం, మంగళూరు, పాడూరులో భూగర్భ నిల్వ కేంద్రాలున్నాయి.


More Telugu News