రష్యాతో చర్చలకు మేం సిద్ధం... అయితే బెలారస్ లో కాదు: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

  • ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు
  • చర్చలకు రావాలంటూ ఉక్రెయిన్ కు రష్యా పిలుపు
  • బెలారస్ వేదికగా చర్చలకు ఆహ్వానం
  • దాడులు బెలారస్ నుంచే జరుగుతున్నాయన్న జెలెన్ స్కీ
ఉక్రెయిన్ పై ఓవైపు దాడులు చేస్తూనే, మరోవైపు చర్చలకు రావాలని రష్యా ఆహ్వానం పలుకుతోంది. తమ ప్రతినిధి బృందాన్ని బెలారస్ పంపిస్తామని, ఉక్రెయిన్ బృందం కూడా బెలారస్ రావాలని రష్యా పేర్కొంటోంది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ స్పందించారు. రష్యాతో చర్చలకు తాము అంగీకరిస్తున్నామని, అయితే చర్చలకు వేదికగా బెలారస్ తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రష్యా దురాక్రమణకు బెలారస్ ఎంతో సహకరిస్తోందని, అలాంటి చోట తాము చర్చలు జరపబోమని జెలెన్ స్కీ పేర్కొన్నారు. వార్సా, బ్రటిస్లావా, బుడాపెస్ట్, ఇస్తాంబుల్, బాకు... ఈ ప్రాంతాల్లో ఎక్కడ చర్చలు జరిపినా తమకు సమ్మతమేనని వివరించారు. ఉక్రెయిన్ కు వ్యతిరేకం కాని దేశాల్లోనే తాము చర్చలు జరుపుతామని ఉద్ఘాటించారు. 

రష్యా దాడులు అత్యంత కిరాతకమని, సాధారణ పౌరుల ఆవాసాలను సైతం ధ్వంసం చేస్తోందని జెలెన్ స్కీ ఆరోపించారు. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటున్నట్టు ప్రకటించిన రష్యా అందుకు విరుద్ధంగా పౌర సముదాయాలపై బాంబుల వర్షం కురిపిస్తోందన్నారు.


More Telugu News