నేడు మీకు ఈ ఇద్ద‌రిని పరిచ‌యం చేయాల‌నుకుంటున్నాను: ప్ర‌ధాని మోదీ

  • భారతీయ సంస్కృతి, వారసత్వం చాలా గొప్ప‌వి
  • టాంజానియన్ తోబుట్టువులు కిలీ పాల్, నిమా వాటిని పాటిస్తున్నారు
  • సామాజిక మాధ్య‌మాల్లో వీడియోలు పోస్ట్ చేస్తుంటారు
  • భారతీయ సంగీతంపై అభిరుచి, ప్రేమ వారికి ఉన్నాయి
భారతీయ సంస్కృతి, వారసత్వం చాలా గొప్ప‌వ‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఈ రోజు ఆయ‌న మ‌న్ కీ బాత్‌లో మాట్లాడుతూ... నేడు ఇద్దరిని పరిచయం చేయాలనుకుంటున్నాన‌ని అన్నారు. ఇద్దరు టాంజానియన్ తోబుట్టువులు కిలీ పాల్, నిమా సామాజిక మాధ్య‌మాల్లో వీడియోలు పోస్ట్ చేస్తుంటార‌ని చెప్పారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లో, వార్తల్లో నిలుస్తుంటార‌ని తెలిపారు. 
                       
వారి గురించి ప్ర‌జ‌లు విని ఉంటారని భావిస్తున్నాన‌ని తెలిపారు. వారిలో భారతీయ సంగీతంపై అభిరుచి, ప్రేమ ఉన్నాయని కొనియాడారు. ఈ కారణంగానే వారిద్ద‌రు ప్రజాదరణ పొందారని తెలిపారు. భార‌తీయ పాట‌లు, సంస్కృతికి లిప్ సింక్ చేసే విధానం అద్భుత‌మ‌ని చెప్పారు. దాన్నిబ‌ట్టే వారు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుందని చెప్పారు.  

తోబుట్టువులు కిలి, నీమలను గ‌త నెల‌ రిపబ్లిక్ డే సందర్భంగా పాడిన‌ జాతీయ గీతం జనగణ‌మనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింద‌ని ప్రధాని మోదీ తెలిపారు. కొన్ని రోజుల క్రితం కూడా లతా దీదీకి ఓ పాట పాడి ఆత్మీయ నివాళులర్పించారని అన్నారు. ఆ తోబుట్టువుల‌ సృజనాత్మకత‌ను అభినందిస్తున్నాన‌ని చెప్పారు. 

భారతీయ సంగీత మాయాజాలం అందరినీ ఆకట్టుకుంటోంద‌ని చెప్పారు. అలాగే, కొన్నేళ్ల క్రితం ప్రపంచంలోని 150కి పైగా దేశాల నుండి గాయకులు, సంగీతకారులు, ఆయా దేశాలలో వారి సంప్ర‌దాయ‌ దుస్తులలో వైష్ణవ్ జన్ పాడి గాంధీజీకి నివాళులు అర్పించార‌ని మోదీ అన్నారు. మ‌న సంస్కృతికి ప్ర‌పంచం జేజేలు కొడుతోంద‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే శివ‌రాత్రి, హోలీ వంటి పండుగ‌లు వ‌రుస‌గా వ‌స్తున్నాయ‌ని, మేడిన్ ఇండియా ఉత్ప‌త్తుల‌నే కొనాల‌ని ఆయ‌న సూచించారు.


More Telugu News