నాలుగో రోజు కొన‌సాగుతోన్న యుద్ధం.. చ‌మురు డిపోపై క్షిపణులు.. గాలి విష‌పూరితంగా మారే ముప్పు

  • వాసిల్కివ్ లోని చ‌మురు డిపోపై ర‌ష్యా దాడి
  • ఓఖ్టిర్కాలోనూ బాంబులు వేసిన వైనం
  • కీవ్‌లో కొన‌సాగుతోన్న పోరు
ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య నాలుగో రోజు యుద్ధం కొన‌సాగుతోంది. వాసిల్కివ్ లోని ఓ చ‌మురు డిపోపై ర‌ష్యా క్షిపణులతో దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతంలో గాలి విష‌పూరితంగా మారే ముప్పు ఉంద‌ని అధికారులు హెచ్చ‌రించారు. అలాగే, ఈశాన్య న‌గ‌రం ఓఖ్టిర్కాలోనూ ర‌ష్యా దాడులు జ‌ర‌ప‌డంతో ఓ ఏడేళ్ల బాలిక స‌హా ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అక్క‌డి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌క‌టించారు. 

ఇక కీవ్‌లో బాంబుల మోత విన‌ప‌డుతూనే ఉంది. క్షిప‌ణుల‌తోనూ ర‌ష్యా దాడులు జ‌రుపుతోంది. కీవ్ లోని అపార్ట్‌మెంట్ వ‌ద్ద కూడా బాంబులతో ర‌ష్యా దాడులు జ‌రుపుతుండ‌డంతో అమాయ‌క ప్ర‌జ‌లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. కీవ్‌ను అధీనంలో తెచ్చుకుంటే ర‌ష్యా ల‌క్ష్యం పూర్త‌యిన‌ట్లుగానే భావించాలి. 

ర‌ష్యా ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా ఉక్రెయిన్‌పై చ‌ర్య‌లు కొన‌సాగిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నేతృత్వంలో ఆ దేశ సైన్యం ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. అయితే, తాము ఆయుధాలను వీడబోమ‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు స్ప‌ష్టం చేశారు. కీవ్‌లో సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను కూడా యుద్ధానికి సిద్ధం చేశారు. ఉక్రెయిన్‌కు ప‌లు దేశాలు ఆయుధాలు అందిస్తూ సాయ‌ప‌డుతున్నాయి. 

వేల మంది వాలంటీర్ల‌కు ఆయుధాలు ఇచ్చారు. యుద్ధం కార‌ణంగా ఉక్రెయిన్‌లోని విదేశీయులు భయం గుప్పిట్లో ఆ దేశాన్ని వీడి ప్ర‌త్యేక విమానాల్లో సొంత దేశాల‌కు వెళ్లే ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు.  భార‌తీయ విద్యార్థుల‌ను తీసుకురావ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక విమానాలు ఏర్పాటు చేసింది. ర‌ష్యా దాడి భ‌యంతో బంక‌ర్లు, మెట్రో స్టేష‌న్ల‌లోని అండ‌ర్‌గ్రౌండ్ల‌లో త‌లదాచుకున్న ప్ర‌జ‌లు ఆహారం దొర‌క‌క ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


More Telugu News