ధోనీ, కోహ్లీ సాధించలేకపోయిన ప్రపంచ రికార్డును సాధించిన రోహిత్ శర్మ

  • స్వదేశంలో అత్యధిక టీ20 మ్యాచుల్లో విజయం సాధించిన కెప్టెన్‌గా రోహిత్
  • ఇయన్ మోర్గాన్ రికార్డును బద్దలుకొట్టిన రోహిత్ 
  • నేటి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిస్తే భారత జట్టు ఖాతాలో మరో రికార్డు
అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా సారథి రోహిత్ శర్మ అత్యంత అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ధర్మశాలలో గత రాత్రి శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత జట్టు ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇటీవల భారత్‌లో పర్యటించిన విండీస్ జట్టును వన్డే, టీ20ల్లో వైట్ వాష్ చేసిన రోహిత్ సేన, శ్రీలంకతో ఇప్పటి వరకు జరిగిన రెండు టీ20ల్లోనూ జయభేరి మోగించింది. ఫలితంగా స్వదేశంలో అత్యధిక టీ20ల్లో విజయం సాధించిన కెప్టెన్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు.

రోహిత్ ఇప్పటి వరకు 17 టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించగా 16 మ్యాచుల్లో జట్టుకు విజయాలు అందించిపెట్టాడు. దీంతో 15 టీ20 విజయాలతో ఈ జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్ సారథి ఇయన్ మోర్గాన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రికార్డులను అధిగమించాడు. 

 టీమిండియా మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ 13, మహేంద్రసింగ్ ధోనీ 11 విజయాలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతేకాదు, నేటి సాయంత్రం శ్రీలంకతో జరగనున్న చివరి టీ20లో భారత జట్టు విజయం సాధిస్తే వరుసగా మూడు సిరీస్‌లలో ప్రత్యర్థి జట్లను వైట్‌వాష్ చేసిన జట్టుగానూ టీమిండియా రికార్డులకెక్కుతుంది. న్యూజిలాండ్, విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత జట్టు 3-0తో భారత జట్టు క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.


More Telugu News