"ఆయుష్మాన్‌"కు కేంద్ర కేబినెట్ ఆమోదం

  • స్కీమ్ అమ‌లు కోసం రూ.1,600 కోట్ల కేటాయింపు
  • నేష‌న‌ల్ హెల్త్ అథారిటీ ద్వారా ప‌థ‌కం అమ‌లు
  • ఇప్ప‌టికే ఈ స్కీం కింద 17 కోట్ల ఖాతాలు ఓపెన్‌
కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్ మిషన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శనివారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ స్కీమ్‌ను ఆమోదిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్ అమ‌లు కోసం వచ్చే ఐదేళ్లకు రూ.1,600 కోట్లు కేటాయించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ స్కీమ్‌ను నేషనల్‌ హెల్త్‌ అథారిటీ అమలు చేయ‌నుంది.

ఈ స్కీమ్‌ కింద పౌరులు ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌కు సంబంధించిన రికార్డులను డిజిటల్‌గా నమోదు చేసుకోవచ్చు. ఈ రికార్డులు వైద్య రంగంలో సేవలందించే వారికి ఉపయోగపడతాయి. డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన వైద్య సేవలు పొందే వీలవుతుందనే ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను మోదీ స‌ర్కారు ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌ కింద ఇప్పటివరకు 17 కోట్లకు పైగా ఖాతాలు ఓపెన్‌ అయినట్లు కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది.


More Telugu News