ఉక్రెయిన్ ప్రశాంతమైన దేశం... అందుకే ఆయుధాలు ఇచ్చి సాయపడుతున్నాం: పోలెండ్ రాయబారి

  • ఉక్రెయిన్ లో రష్యా దళాల బీభత్సం
  • కీవ్ పై ఆధిపత్యం కోసం భారీ పోరాటం
  • ఉక్రెయిన్ పై సర్వత్రా సానుభూతి
  • ఈయూ దేశాలు ఆయుధాలు ఇస్తున్నాయన్న పోలెండ్ రాయబారి
రష్యా దుందుడుకు చర్యల నేపథ్యంలో యూరప్ దేశం ఉక్రెయిన్ కు సాటి ఐరోపా దేశాల నుంచి క్రమంగా మద్దతు పెరుగుతోంది. దీనిపై ఉక్రెయిన్ లో పోలెండ్ రాయబారి ఆడమ్ బురకోవ్ స్కీ స్పందించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, యూరోపియన్ యూనియన్ లోని దేశాలన్నీ ఉక్రెయిన్ కు సాయపడుతున్నాయని తెలిపారు. 

రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ కు ఆయుధాలు, ఇతర మానవతా పరమైన వస్తు సరంజామా అందిస్తున్నామని వెల్లడించారు. ఈ తీవ్ర పరిస్థితుల్లో ఉక్రెయిన్ కు పోలెండ్ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. రష్యా దూకుడును ఉక్రెయిన్ దీటుగా తిప్పికొడుతుందున్న నమ్మకం తమకుందని బురకోవ్ స్కీ వెల్లడించారు. 

"తన సైనిక శక్తిని ఉపయోగిస్తూ ఉక్రెయిన్ ప్రజలను రష్యా లక్ష్యంగా చేసుకుంటోంది. సాధారణ పౌరులపై రష్యా దాడులు చేస్తుండగా, రక్షణ కోసం ఉక్రెయిన్ పోరాడుతోంది. నాటోలో ఇతర సభ్య దేశాలతో కలిసి పోలెండ్ రష్యా చర్యలను తీవ్రంగా ఖండిస్తోంది" అని బురకోవ్ స్కీ పేర్కొన్నారు. ఓ శాంతికాముక దేశంపై దాడికి దిగినందునే ఈయూ రష్యాపై ఆంక్షలు విధించిందని స్పష్టం చేశారు. 

కాగా, ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో ఓటింగ్ కు భారత్ దూరంగా ఉండడం పట్ల కూడా పోలెండ్ రాయబారి బురకోవ్ స్కీ స్పందించారు. భారత్ ఒక స్వతంత్ర దేశమని, ఏ నిర్ణయం అయినా సొంతంగానే తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. 

ఉక్రెయిన్ నుంచి బయటపడాలనుకుంటున్న ప్రజలను (భారతీయులను కూడా) తాము స్వాగతిస్తామని పోలెండ్ తెలిపింది. ఉక్రెయిన్ లో దాదాపు 20 వేల మంది వరకు భారతీయ విద్యార్థులు ఉన్నారని, వారు పోలెండ్ సరిహద్దుల వద్ద నిరభ్యంతరంగా వెళ్లొచ్చని, వారిని క్షేమంగా తరలించేందుకు భారత ఎంబసీతో సమన్వయం చేసుకుంటున్నామని బురకోవ్ స్కీ వెల్లడించారు.


More Telugu News