ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ

  • శాంతి నెలకొల్పేందుకు సాయం చేస్తామన్న మోదీ
  • హింసకు స్వస్తి పలకాలన్నదే తమ వైఖరి అని వెల్లడి
  • ఉక్రెయిన్ పరిస్థితి పట్ల తీవ్ర విచారం
  • భారత పౌరులు చిక్కుకుపోవడం పట్ల ఆందోళన
రష్యా దాడులను ఎదుర్కొంటూ తీవ్ర విపత్కర పరిస్థితుల్లో నిలిచిన ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా సంభాషించారు. ఉక్రెయిన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను జెలెన్ స్కీ ప్రధాని మోదీకి వివరించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ లో జరిగిన ప్రాణ, ఆస్తినష్టం పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

హింసకు స్వస్తి పలకాలన్న తమ వైఖరిని మోదీ పునరుద్ఘాటించారు. చర్చలే సమస్య పరిష్కారానికి మార్గమన్న తమ పంథాను మరోసారి స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ఏ రూపంలో అయినా సాయపడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీకి మాటిచ్చారు. 

అదే సమయంలో, ఉక్రెయిన్ లోని భారత పౌరుల భద్రత పట్ల మోదీ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. అక్కడ చిక్కుకుపోయిన భారతీయ పౌరులను క్షేమంగా తరలించేందుకు ఉక్రెయిన్ అధికారులు సత్వరమే ఏర్పాట్లు చేయాలని కోరారు.


More Telugu News