ఫ్యూచర్ రిటైల్ కార్యకలాపాలను తన నియంత్రణలోకి తీసుకుంటున్న రిలయన్స్... ఉద్యోగులకు అభయహస్తం

  • వివాదాస్పదమైన ఫ్యూచర్ రిటైల్-రిలయన్స్ ఒప్పందం
  • రూ.24,713 కోట్లకు ఫ్యూచర్ రిటైల్ కొనుగోలు
  • స్వాధీనం ప్రక్రియ షురూ చేసిన రిలయన్స్
వివాదాస్పద ఫ్యూచర్ రిటైల్ స్టోర్ల కార్యకలాపాల నియంత్రణను రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అధీనంలోకి తీసుకునే ప్రక్రియ షురూ చేసింది. ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ లో అమెజాన్ పెట్టుబడులు ఉండగా, రిలయన్స్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం వివాదానికి దారితీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఒప్పందం ప్రకారం రిలయన్స్ సంస్థ ఫ్యూచర్ రిటైల్ అవుట్ లెట్లను స్వాధీనం చేసుకుంటోంది. 

దేశవ్యాప్తంగా ఉన్న బిగ్ బజార్ షాపింగ్ మాల్స్ ఫ్యూచర్ రిటైల్ సంస్థ కిందే కొనసాగాయి. ఇప్పుడవి రిలయన్స్ చేతికి రానున్నాయి.  వాటిని ఇకపై తన బ్రాండ్ నేమ్ తో కొనసాగించాలని రిలయన్స్ భావిస్తోంది. అంతేకాదు, ఫ్యూచర్ రిటైల్ సంస్థలో ఇప్పటివరకు ఉద్యోగులుగా ఉన్నవారికి కూడా భరోసా ఇస్తోంది. వారిని రిలయన్స్ రిటైల్ ఉద్యోగులుగా పరిగణించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్ వీఎల్)తో రూ.24,713 కోట్లకు డీల్ కుదిరినట్టు ఫ్యూచర్ రిటైల్ అధినేత కిశోర్ బియానీ 2020 ఆగస్టులో వెల్లడించారు. అప్పటినుంచి వివాదం రాజుకుంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ఫ్యూచర్ రిటైల్ ను సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కు లాగింది. అంతేకాదు ఈ వివాదం సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)లోనూ విచారణలో ఉంది. 

ఈ ఒప్పందం అధికారికంగా కార్యరూపం దాల్చాలంటే న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, వేల కోట్ల ఒప్పందం పూర్తి చేసేందుకు గడవు ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించగా, అప్పట్లోగా కోర్టుల్లో దీనికి క్లియరెన్స్ వస్తుందా? అన్నది సందేహమే.


More Telugu News