యుద్ధం పుతిన్ సొంత నిర్ణ‌య‌మా?.. ర‌ష్యా పార్ల‌మెంటు ఆమోదం లేదా?

  • వేర్పాటువాద న‌గ‌రాల స్వాతంత్య్రానికే ఓటు వేశాం
  • కీవ్‌పై బాంబు దాడుల‌కు ఓటేయ‌లేదు
  • ర‌ష్యన్ చ‌ట్ట‌స‌భ స‌భ్యుడు మిఖాయెల్ మాట్వియేవ్ ట్వీట్ వైరల్‌
  • త‌క్ష‌ణ‌మే ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపాల‌ని వినతి
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన ర‌ష్యా వైఖ‌రిపై ప్ర‌పంచ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ర‌ష్యా పేరు కంటే కూడా ఆ దేశ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్య‌వ‌హార స‌ర‌ళిపై విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి అస‌లు ర‌ష్యాన్ పార్ల‌మెంటు ఒప్పుకుందా?  లేదంటే.. స‌ర్వ సైన్యాధికారిగా పోజు కొడుతోన్న పుతిన్ త‌న సొంత నిర్ణ‌యంతోనే ఉక్రెయిన్‌పైకి దండెత్తారా? అన్న విష‌యంపై ఇప్పుడు ఫుల్ క్లారిటీ వ‌చ్చేసింద‌నే చెప్పాలి. ర‌ష్యాకు చెందిన చ‌ట్ట‌స‌భ స‌భ్యుడు మిఖాయెల్ మాట్వియేవ్ ట్వీట్‌తో ఈ విష‌యంపై క్లారిటీ వ‌చ్చేసింది.

ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌పై బాంబుల వ‌ర్షం కురిపించేందుకు పార్ల‌మెంటులో తాము ఓటు వేయ‌లేద‌ని మాట్వియేవ్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఉక్రెయిన్‌లోని డొనెట్క్స్‌, లుహాన్క్స్ న‌గ‌రాల స్వాతంత్య్రాన్ని గుర్తించ‌డానికి మాత్ర‌మే తాను ఓటేశాన‌ని, కీవ్‌పై బాంబులు వేసేందుకు తాను ఓటు వేయ‌లేదంటూ ఆయ‌న చెప్పుకొచ్చారు. 

అంతేకాకుండా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని త‌క్ష‌ణ‌మే ఆపాల‌ని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా మాట్వియేవ్ చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ఈ ట్వీట్‌తో ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని పుతిన్ పార్ల‌మెంటు ఆమోదం లేకుండా తాను సొంతంగా తీసుకున్న నిర్ణ‌యం ద్వారానే ప్రారంభించార‌ని చెప్పాలి.


More Telugu News