ఉక్రెయిన్ పై దాడిని ఖండించే తీర్మానానికి భారత్ దూరంగా ఉండటానికి కారణం ఇదే!

  • ఓటింగ్ కు దూరంగా ఉన్న ఇండియా, చైనా, యూఏఈ
  • చర్చల ద్వారానే విభేదాలను పరిష్కరించుకోగలమన్న భారత్
  • రెండు దేశాలు దౌత్యమార్గాన్ని వదిలేశాయని వ్యాఖ్య
ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, ఓటింగ్ కు భారత్ దూరంగా వున్న విషయం విదితమే. ఈ తీర్మానానికి 11 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఇండియా, చైనా, యూఏఈ దేశాలు దూరంగా ఉన్నాయి. ఓటింగ్ కు భారత్ దూరంగా ఉండటానికి గల కారణాన్ని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి వెల్లడించారు. 

చర్చల ద్వారా మాత్రమే విభేదాలు, వివాదాలను పరిష్కరించుకోగలమని ఆయన అన్నారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల్లో చర్చలు జరగడం సాధ్యమయ్యే పని కాదని చెప్పారు. రెండు దేశాలు దౌత్య మార్గాన్ని వదిలేయడం దురదృష్టకరమని చెప్పారు. ఈ కారణాల వల్లే ఓటింగ్ కు భారత్ దూరంగా ఉందని తెలిపారు. 

మరోవైపు రష్యా తనకున్న వీటో అధికారం ఉపయోగించి, తీర్మానాన్ని అడ్డుకుంది. అయితే తీర్మానాన్ని వీగిపోయేలా చేస్తారనే విషయాన్ని తాము ముందే ఊహించామని అమెరికా తెలిపింది. మీరు తీర్మానాన్ని మాత్రమే అడ్డుకోగలరని... నిజాన్ని, సిద్ధాంతాలను, ఉక్రెయిన్ ప్రజలను, తమ గళాన్ని అడ్డుకోలేరని అమెరికా రాయబారి లిండా వ్యాఖ్యానించారు.


More Telugu News