మాతృభూమి కోసం తుపాకి చేతపట్టిన ఉక్రెయిన్ మహిళా ఎంపీ.. ఆమె ధైర్యానికి హేట్సాప్ చెబుతూ సలహాలిస్తున్న నెటిజన్లు

  • మహిళలు కూడా ఈ మట్టిని రక్షిస్తారంటూ ట్వీట్
  • ఒక్క తూటాని కూడా వేస్ట్ చేయొద్దంటున్న నెటిజన్లు
  • ఎంపీ కీరా రుడిక్‌పై ప్రశంసల వర్షం
రష్యా సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతూ రాజధాని కీవ్‌ను సమీపించిన వేళ మాతృభూమిని రక్షించుకునేందుకు సామాన్య ప్రజలు, క్రీడాకారులే కాదు మహిళలూ రంగంలోకి దిగుతున్నారు. రష్యా సేనల ముందు తాము నిలబడలేమని తెలిసినా మాతృభూమి పరిరక్షణ కోసం ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 

ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో ఏకే-47 చేబట్టి ఇప్పటికే కదన రంగంలోకి దిగారు. అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా సైనిక దుస్తులు ధరించి ప్రజల్లో ప్రేరణ నింపారు. ఆయనిచ్చిన పిలుపుతో వేలాది మంది ఉక్రెయిన్ పౌరులు తమ దేశం కోసం పోరాడేందుకు ముందుకొస్తున్నారు.

దేశానికి చెందిన ప్రముఖ బాక్సింగ్ సోదరులు విటాలీ క్లిట్స్ చ్కో, వ్లాదిమిర్ క్లిట్స్ చ్కో మాతృదేశం కోసం యుద్ధంలో పాల్గొంటామని ప్రకటించారు. విటాలీ మాజీ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ కావడం గమనార్హం. విటాలీని అభిమానులు ముద్దుగా 'ఉక్కు పిడికిలి' అని పిలుచుకుంటారు. వ్లాదిమిర్ కూడా గొప్ప బాక్సరే. రాజధాని కీవ్ కు 2014 నుంచి విటాలీ మేయర్ గా ఉన్నారు.

తాజాగా, ఉక్రెయిన్ ఎంపీ, ‘రింగ్ ఉక్రెయిన్’ మాజీ సీఈవో కిరా రుడిక్ కూడా కదనరంగంలోకి దిగేందుకు సై అన్నారు. రష్యా దురాక్రమణ నుంచి తమ దేశాన్ని తాము రక్షించుకుంటామని ప్రతినబూనారు. ఈ మేరకు ఆమె అత్యాధునిక ఏకే-47 తుపాకి చేతపట్టిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. కలాష్నికోవ్‌ను ఉపయోగించడం నేర్చుకుంటానని, ఆయుధాలు చేబూనేందుకు సిద్ధమవుతున్నానని పేర్కొన్నారు. మన పురుషుల్లానే మన స్త్రీలు కూడా ఈ దేశ మట్టిని కాపాడతారని ఆమె పేర్కొన్నారు. 

కిరా పోస్టుకు విపరీతమైన స్పందన వస్తోంది. ఆమె ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. తుపాకిని ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఒక్క తూటాని కూడా వృథాగా పోనివ్వొద్దని సలహా ఇస్తున్నారు. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


More Telugu News