భీమ్లా నాయక్ సెగ... మంత్రులు పేర్ని నాని, కొడాలి నానీల వాహనాలను అడ్డుకున్న పవన్ ఫ్యాన్స్

  • పవన్ నటించిన భీమ్లా నాయక్ నేడు విడుదల
  • ఏపీలో థియేటర్లపై ప్రభుత్వ నిఘా
  • భగ్గుమంటున్న పవన్ అభిమానులు
పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకువచ్చింది. సాధారణంగా పవన్ చిత్రం రిలీజ్ అంటే అభిమానులకు పండుగే. కానీ, ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. థియేటర్లపై ఏపీ ప్రభుత్వం రెవెన్యూ అధికారులు, పోలీసులతో నిఘా విధించిందంటూ పవన్ అభిమానులు భగ్గుమంటున్నారు.

ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానీల వాహనాలను పవన్ అభిమానులు అడ్డుకున్నారు. గుడివాడలో జీ3 భాస్కర్ థియేటర్ ప్రారంభోవత్సవ కార్యక్రమానికి వచ్చిన పేర్ని నాని, కొడాలి నానీలకు పవన్ అభిమానుల సెగ తగిలింది. జనసేన జెండాలు చేతబూనిన అభిమానులు ఒక్కసారిగా వాహనాలకు అడ్డుగా రావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పవన్ అభిమానులను అక్కడ్నించి పంపించివేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, జనసైనికులకు మధ్య తీవ్ర వాగ్యుద్ధం నెలకొంది.

మంత్రుల కాన్వాయ్ వస్తుందని తెలియడంతో ఆ మార్గం పొడవునా జనసైనికులు జెండాలు చేతబూని నిరసనలు తెలుపుతూ కనిపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, జీ3 థియేటర్ వద్ద ఆందోళనకు యత్నించిన గుడివాడ జనసేన పార్టీ ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్ ను, పవన్ అభిమానులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News